Security Breach in Parliament: 



లలిత్‌ ఝా విచారణ..


లోక్‌సభ దాడిలో (Parliament Security Breach) కీలక సూత్రధారి లలిత్ ఝా (Lalit Jha) పోలీసుల విచారణలో మరి కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించి ప్రభుత్వం దృష్టిని తమ వైపు మళ్లించేందుకే ఈ పని చేసినట్టు అంగీకరించాడు. తమ డిమాండ్‌లు తీర్చేలా ప్రభుత్వం వెంటనే దిగి రావాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్టు వివరించాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను రీక్రియేట్ చేసేందుకు పార్లమెంట్ అనుమతి తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ 5గురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కీలక నిందితుడైన లలిత్ ఝా కర్తవ్యపథ్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. లోక్‌సభలో దాడి చేసేందుకు మరో నిందితుడితో కలిసి లలిత్ ఝా స్కెచ్ వేసినట్టు పటియాలా హౌజ్‌ కోర్టులో ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి లలిత్‌ ఏడు రోజుల కస్టడీలో ఉంచారు. నిజానికి పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నా..దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావించాడు. అందుకే ఏకంగా సభలోకి దూసుకెళ్తే అందరి దృష్టి తమవైపు మళ్లుతుందని అనుకున్నాడు. అందుకోసం గూగుల్‌ సాయంతో మొత్తం పార్లమెంట్‌కి సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. పార్లమెంట్ సెక్యూరిటీ వీడియోలు చూశాడు. నిందితులంతా ఎవరికీ అనుమానం రాకుండా ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా తెలుసుకున్నాడు. Signal App సాయంతో అందరూ మాట్లాడుకున్నారు. ఈ విచారణ సమయంలోనే పోలీసులు అన్ని కోణాల్లోనూ ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిలో విదేశీ కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. ఏ ఉగ్రవాద సంస్థైనా వీళ్లను ప్రేరేపించిందా అని అనుమానిస్తున్నారు. 


విదేశీ నిధులు..? 


ఈ దాడి తరవాత లలిత్ ఝా రాజస్థాన్‌కి పారిపోయాడు. అక్కడ ఎక్కడ తలదాచుకున్నాడు..? ఎవరితో మాట్లాడాడు..? అని పోలీసులు ఆరా తీసేందుకు సీన్ రీక్రియేట్ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లలిత్ ఝా తన ఫోన్‌ని ఎక్కడో పారేశాడు. మిగిలిన వాళ్ల ఫోన్‌లను తగలబెట్టాడు. సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఢిల్లీ-జైపూర్ బార్డర్ వద్ద తన ఫోన్‌ని పారేసినట్టు విచారణలో చెప్పాడు లలిత్ ఝా. నిరుద్యోగం కారణంగానే తీవ్ర అసహనంతో ఈ దాడికి పాల్పడినట్టు వివరించాడు. అయితే..పోలీసులు మాత్రం ఇదొక్కటే మోటివ్ కాకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఈ దాడి చేసేందుకు వీళ్లకు విదేశీ నిధులు అంది ఉండొచ్చన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. 


ఇప్పుడిప్పుడే ఈ నిందితుడి బ్యాగ్రౌండ్‌ గురించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. బిహార్‌కి చెందిన ఝా...కోల్‌కత్తాలో టీచర్‌గా పని చేస్తున్నాడు. పార్లమెంట్‌కి సమీపంలోని కర్తవ్యపథ్ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ అంటే లలిత్‌కి ఎంతో ఇష్టం. ఆయన ఐడియాలజీపై ఆసక్తి పెంచుకున్నాడు. లలిత్ ఝా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని, మౌనంగా ఉండేవాడని సన్నిహితులు చెబుతున్నారు. స్థానిక విద్యార్థులకు టీచింగ్ చేసేవాడు.కొన్నేళ్ల క్రితం కోల్‌కత్తాలోని బుర్రాబజార్‌కి ఒక్కడే వచ్చాడు. చాలా రోజుల పాటు అక్కడే ఒంటరిగా ఉన్నాడు. కానీ ఎవరికీ పెద్దగా కనిపించే వాడు కాదు. లో ప్రొఫైల్ మెయింటేన్ చేసేవాడు. రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి అక్కడి నుంచి ఖాళీ చేశాడు. అక్కడే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఓ టీ షాప్ ఓనర్ ఇదంతా చెప్పాడు. 


Also Read: Gaza: సొంత దేశ బందీలనే చంపుకున్న ఇజ్రాయేల్, పొరపాటు జరిగిందంటూ నెతన్యాహు విచారం