Lok Sabha Security Breach: పార్లమెంటులో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన ఘటన బాధాకరం అని అన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు అన్నారు. అత్యంత భద్రతతో కూడిన పార్లమెంటులో ఎంపీలకే భద్రత కరువైందని అన్నారు. కొత్త పార్లమెంటు కట్టి ఏం చేశారని హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల మాటలు ఘనంగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఆ ఘనం లేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నర్సాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ ఘ‌ట‌న‌తో 2001లో పార్ల‌మెంట్‌పై జ‌రిగిన దాడి గుర్తుకు వ‌స్తుంద‌న్నారు. పార్ల‌మెంట్ స‌భ్యులంద‌రి భ‌ద్ర‌త కోసం ప్రార్థిస్తున్నామ‌ని, దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్న‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్‌ రావు ఎక్స్ లో పోస్టు చేశారు.


కష్టపడ్డవారిని గుర్తు పెట్టుకుంటాం - హరీశ్ రావు
‘‘అందరూ కష్టపడ్డారు. నర్సాపూర్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేలా చేశారు. శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నాను. కష్టపడిన వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాం. పార్టీ ఓటమి అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. గమ్యం చేరేది మన బీఆర్ఎస్ పార్టీ నే. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అధికార పక్షం చేస్తుంది. ఫోన్ చేస్తే గట్టిగా గంటలో అందుబాటులో ఉంటాను. మీ ఎమ్మెల్యే సునితమ్మతో పాటు నేను అందుబాటులో ఉంటా.


పని తనం తప్ప పగతనం తెలీదు - హరీశ్ రావు
కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేశారు. మనం చేసిన కృషి నిలకడ మీద తెలుస్తుంది. పని తనం తప్ప పగ తనం తెలియని నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ నేతల హౌసింగ్ స్కాం మీద రిపోర్ట్ వస్తే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మనం దృష్టి పెట్టాం. పగ మీద దృష్టి పెట్టలేదు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులు చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ నాయకులు సగం మంది జైళ్లలో ఉండేవారు. కానీ మనం అలా చేయలేదు. గెలుపు ఓటములు సహజం ఒలికిపోయిన పాల గురించి ఆలోచన వద్దు. భవిష్యత్తులో సాధించే విజయం గురించి ఆలోచిద్దాం. అందరం కలిసి శ్రమించి విజయం వైపు వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు సహజం. 2001 నుండి ఎన్నో ఆటు పొట్లు ఎదుర్కొన్నాము. ఎదిగినా ఒదిగి పని చేశాం. పాలు, నీళ్ళు ఏంటి అనేది నాలుగు రోజుల్లో ప్రజలు గుర్తిస్తారు. అధికార పక్షం అయినా, ప్రతి పక్షం అయినా మేం ప్రజల పక్షం. 


ఇచ్చిన హామీలు అమలు చేసేలా పోరాటం చేస్తాం. నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ ఆందోళన వద్దు. నర్సాపూర్ లో అన్ని మండలాలు మంచి లీడ్ ఇచ్చాయి. అందరూ బాగా కష్ట పడ్డారు’’ అని హరీశ్ రావు భరోసా కల్పించారు.