Lok Sabha Elections 2024 Schedule: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని (Lok Sabha Elections 2024 Dates) ఈసీ వెల్లడించింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 19 న మొదటి విడత మొదలై జూన్ 1న మలి విడత పూర్తవుతుంది. గత లోక్‌సభ ఎన్నికలనూ ఇలాగే 7 విడతల్లో నిర్వహించింది ఈసీ. అన్నివిడతలు అంటే ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఈసారి ఈ విడతల్ని తగ్గిస్తుందని భావించినా అదే తరహాలో కొనసాగించనున్నట్టు తెలిపింది. 1951-52 మధ్య కాలంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు తొలిసారి ఇంత సుదీర్ఘంగా సాగాయి. ఇది రెండో అతి పెద్ద ఎన్నికల షెడ్యూల్. మొత్తంగా చూస్తే 44 రోజుల పాటు పోలింగ్ జరగనుంది. అయితే...నోటిఫికేషన్‌లు, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అన్నీ కలుపుకుంటే మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ 82 రోజుల పాటు కొనసాగనుంది. ఇన్ని రోజుల పాటు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం..గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే...ఈ సారి 6 రోజుల పాటు ఆలస్యంగా షెడ్యూల్‌ని విడుదల చేయడం. నిజానికి ఎప్పటిలాగే ఈ తేదీల్ని విడుదల చేయాలని ఈసీ భావించినా ఉన్నట్టుండి కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌లో అప్పటికే ఓ ప్లేస్ వేకెన్సీ ఉంది. దానికి తోడు అరుణ్ గోయల్ కూడా వెళ్లిపోయారు. ఫలితంగా ఈ రెండు స్థానాల్ని భర్తీ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఆ తరవాత సెలెక్షన్ కమిటీ కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. మార్చి 14న ఈ నియామకం జరగ్గా మార్చి 15న వాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే మార్చి 16న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఇక మార్చి,ఏప్రిల్ నెలల్లో వరుసగా పండుగలు ఉండడం కూడా ఎన్నికల షెడ్యూల్ గడువుని పెంచడానికి మరో కారణం. హోళీ, తమిళ కొత్త సంవత్సరం, బైశాఖి తదితర పండుగలున్నాయి. ఈ సెలవు రోజులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఎన్నికల సంఘం. వీటితో పాటు భద్రతా కారణాలూ ఉన్నాయి. భద్రతా బలగాలు ఓ విడత ఎన్నికలు ముగిశాక మరో విడత ఎన్నికలకు వేరే చోటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇలా ప్రతి రెండు విడతల మధ్య ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే మొత్తంగా ఆరు రోజుల సమయం పడుతోంది. ఈ మధ్యలో పండుగ రోజులున్నాయి. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువుకి ఎక్కడా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈసీ. ఫలితంగానే ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియని నిర్వహించాల్సి వస్తోందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి అన్ని ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Also Read: హాస్టల్‌లో నమాజ్ చేసుకుంటున్న ముస్లిం విద్యార్థులపై మూకదాడి - జైశ్రీరామ్ నినాదాలు