Elections 2024 Results: ఇండీ కూటమి ఇంతగా ఎలా ప్రభావం చూపించింది అన్న ప్రశ్న రాగానే అందరూ ముందుగా చెప్పే సమాధానం రాహుల్ గాంధీ. గత ఐదేళ్లలో ఆయన అంతగా బలం పెంచుకున్నారు. "పప్పు"గా ముద్ర వేసినా ఆ మరక తొలగించుకోడానికి గట్టిగానే ప్రయత్నించారు. భారత్ జోడో యాత్రతో పుంజుకున్నారు. ఆ తరవాత భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగించారు. ఈ యాత్రల్లో ఆయన ప్రజలతో మమేకమైన తీరు కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్‌నిచ్చింది. సోషల్ మీడియాలోనూ గట్టిగానే ప్రచారం చేసింది పార్టీ. ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ప్రతిపక్ష నేతల్లో మోదీని ఎక్కువగా టార్గెట్ చేసింది రాహుల్ గాంధీ మాత్రమే. అందుకే ఒకానొక సమయంలో ఆయనను ప్రధాని అభ్యర్థిగానూ ప్రచారం చేశారు. ప్రజలతో మాట్లాడడం, విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడం, మెకానిక్‌లతో కలిసి కూర్చోవడం లాంటివి ఆయనలో మరో కోణాన్ని ప్రజలకు పరిచయం చేశాయి. అయితే...ఇదంతా చేసింది రాహుల్ గాంధీయే అయినా...అటు ప్రియాంక గాంధీ తెరవెనక ఉండి ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా సరే...ఎన్నికలపై ప్రభావం చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడీ ఫలితాలే అందుకు నిదర్శనం.
రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ సీనియర్లతో మాట్లాడడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఒక్కటి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరమూ పోటీ చేస్తే ప్రచారానికి ఇబ్బంది అవుతుందని ప్రియాంక గాంధీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అలా ఒకరికి ఒకరు తోడై ఈ అన్నా చెల్లెళ్లు మేజిక్ చేశారు. అమేథి, రాయ్‌బరేలిలో ప్రియాంక గాంధీ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అన్నతో పాటే వెన్నంటి నడిచారు. క్షేత్రస్థాయి నుంచి పరిస్థితులను పరిశీలించి అందుకు తగ్గట్టుగానే ప్రచార వ్యూహాలు రచించారు. పైగా ప్రజలతో మమేకమవడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. పార్టీకి కార్యకర్తలకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించారు. ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యల్ని తిప్పి కొట్టడంలో సక్సెస్ అయ్యారు. మంగళసూత్ర వివాదాన్నీ తెరపైకి తీసుకొచ్చారు. 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించిందని, ఎవరైనా మంగళసూత్రాలు దొంగిలించారా అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. అలా ఎప్పటికప్పుడు కౌంటర్‌లు వేస్తూ మోదీ వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు ప్రియాంక గాంధీ. ఇలా ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌తో పాటు ఇండీ కూటమికీ బలం ఇచ్చారు.