Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు..? ఎప్పుడు కౌంటింగ్ ఉంటుందన్న వివరాలేవీ అధికారికంగా ఎన్నికల సంఘం చెప్పలేదు. కానీ ఏప్రిల్ 19వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇదంతా ఫేక్ అంటూ తేల్చి చెప్పింది. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దంటూ స్పష్టం చేసింది. మార్చి 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని ఆ మెసేజ్‌ సర్క్యులేట్ అయింది. అంతే కాదు. మే 22న ఫలితాలు వచ్చేస్తాయనీ అందులో ఉంది. పైగా ఒకటే ఫేజ్‌లో ఈ ఎన్నికలు జరుగుతాయంటూ ఈ మెసేజ్ వాట్సాప్‌ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టింది. ఫలితంగా ఈసీ అప్రమత్తమైంది. వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 16న ఎన్నికలు జరుగుతుండొచ్చు అంటూ ఇప్పటికే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో ఇలాంటి వదంతులు వ్యాపించడంపై కేంద్ర ఎన్నికల సంఘం అసహనం వ్యక్తం చేస్తోంది. 


"లోక్‌సభ ఎన్నికలు 2024 తేదీల గురించి వాట్సాప్‌ గ్రూప్‌లలో ఓ ఫేక్ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ ఈసీఐ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి తేదీలు ప్రకటించలేదు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారికంగా ఈ తేదీల్ని ప్రకటిస్తారు. ఇలాంటివి పంపే ముందు ఓ సారి వెరిఫై చేసుకోండి"


- ఎన్నికల సంఘం 


 






లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని మార్చి 13 తరవాత విడుదల చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియంతా పూర్తైన వెంటనే షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో పర్యటిస్తోంది. ఆ తరవాత యూపీ, జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తుంది. మార్చి 13లోగా ఈ పర్యటనలు ముగించుకుని ఆ వెంటనే పోలింగ్ తేదీలు విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది ఈసీ. పలు ప్రాంతాల్లోని సమస్యలు, ఈవీఎమ్‌లు తరలించేందుకు ఎదురయ్యే సవాళ్లు, ఇతరత్రా భద్రతా పరమైన సమస్యలపై చర్చించింది. నిఘా పెంచాలని అధికారులను ఆదేశించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లో త్వరలోనే ఈసీ బృందాలు పర్యటించనున్నాయి.


Also Read: ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ సెక్షన్‌లో బొద్ధింకలు, సోషల్ మీడియాలో రచ్చ - వీడియో వైరల్