Lok Sabha Polls 2024: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ విడత పూర్తైంది. ఈ నెల 26న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పలు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో వడగాలుల ముప్పు నుంచి ఓటర్లను కాపాడేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఈ మేరకు X వేదికగా ఎన్నికల సంఘం ఓ పోస్ట్ పెట్టింది.


ఈ సమావేశంలో వాతావరణ విభాగ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు, హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. సాధారణం కన్నా కనీసం 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎండలకు తోడు వేడిగాలులు ఊపిరి సలపనివ్వడం లేదు. మొదటి విడత ఎన్నికలు జరగకముందే ఏప్రిల్ 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ కీలక సమావేశం జరిగింది. వడగాలుల ముప్పుని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ అప్పుడే అధికారులను ఆదేశించారు. 






IMD వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశా, రాయలసీమ, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, యూపీలో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. నిజానికి ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో విపరీతమైన వేడితో అల్లాడిపోక తప్పదని గతంలోనే IMD హెచ్చరించింది. ఏప్రిల్‌లో కనీసం 4-8 రోజుల పాటు విపరీతమైన వడగాడ్పులు వీస్తాయని ముందుగానే అంచనా వేసింది. జూన్ వరకూ మరో 10-20 రోజుల వరకూ వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఏపీ, మరఠ్వాడా, బిహార్, ఝార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లో 20 రోజుల కన్నా ఎక్కువగా వేడి గాలులు వీచే అవకాశాలున్నాయి. ఈ సారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని IMD వెల్లడించింది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తోంది. ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదైతేనే ఆహార పంటలు సమృద్ధిగా పండుతాయి. లేదంటే పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముంది. 


Also Read: Vasuki Indicus Snake: 4.7 కోట్ల ఏళ్ల నాటి భారీ పాముకి వాసుకి పేరు ఎందుకు పెట్టారు?