Income Tax Return Filing 2024: 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ (FY24) లేదా 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు (AY25) సంబంధించి ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ITR 2024 ఫైలింగ్ సీజన్ ఈ నెల 01 నుంచి ప్రారంభమైంది. ఐటీఆర్ దాఖలు చేయడానికి 2024 జులై 31 వరకు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ఉంది. ఈ గడువు దాటితే, లేట్ ఫైన్‌తో కలిపి రిటర్న్ ఫైల్ చేయడానికి 2024 డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది.
టాక్స్ రిఫండ్ విషయానికి వస్తే.. సాధారణంగా, ఫామ్-16లో చూపిన దానికంటే ఎక్కువ పన్నును ఆదా చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. సరైన అవగాహన ఉంటే, ఫామ్-16లో కనిపించిన దాని కంటే ఎక్కువ టాక్స్ సేవ్ (Tax Saving) చేయొచ్చు. అంతేకాదు, ఎక్కువ రిఫండ్ (Income Tax Refund) క్లెయిమ్ చేయడం చాలా సాధ్యమే.
గరిష్ట టాక్స్ రిఫండ్ పొందే టిప్స్ (Tips to get maximum tax refund):
సరైన పన్ను విధానం (Tax Regime)
గరిష్ట టాక్స్ రిఫండ్ పొందడానికి, పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానాల్లో మీకు ఏ విధానం సరిపోతుందో సరిగ్గా గుర్తించాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS), జీవిత బీమా పాలసీ (Life Insurance Policy) వంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో మీరు పెట్టుబడి పెట్టకపోతే; హోమ్ లోన్ మీద వడ్డీ (Interest on Home Loan), హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) వంటి పన్ను మినహాయింపులు (Tax Deductions) లేకపోతే.. కొత్త పన్ను విధానం (New Tax Regime) మీకు సరిపోతుంది. దీనిలో పన్ను తగ్గింపులు, మినహాయింపులు వంటివి ఉండవు. స్లాబ్ వ్యవస్థ ప్రకారం పన్ను రేట్లు ఉంటాయి.
సకాలంలో ఐటీఆర్ సమర్పించడం
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం.. నిర్దేశించిన గడువు తేదీలోగా టాక్స్ పేయర్ ITR ఫైల్ చేయాలి. ఆలస్యమైన/డేట్ మిస్ అయిన రిటర్న్‌పై సెక్షన్ 234F కింద లేట్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీ 'పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం' (taxable income) రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆలస్య రుసుము రూ. 5,000 వరకు ఉంటుంది. ఈ ఫైన్ పడకుండా చూసుకుంటే, మీరు గరిష్ట టాక్స్ రిఫండ్ తీసుకోవచ్చు.
డేటాను సరిచూసుకోండి
ఫామ్-26AS, ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (AIS) కనిపించే వివరాలను మీ వాస్తవ ఆదాయంతో సరిపోల్చుకోండి. ఏవైనా తేడాలు ఉంటే మీ కంపెనీ యాజమాన్యాన్ని, బ్యాంక్‌ను సంప్రదించండి. దీనివల్ల, అనవసర భారం తగ్గి పన్ను ఆదా అవుతుంది.
రిటర్న్‌ను నెలలోగా ఈ-వెరిఫై చేయాలి
ఇన్‌కమ్ రిటర్న్ ఫైల్ చేసినంత మాత్రాన పని పూర్తి కాదు. ఆదాయ పన్ను పత్రాన్ని సమర్పించిన తేదీ నుంచి ఒక నెల లోగా దానిని ఈ-వెరిఫై (e-Verify) చేయాలి. అంటే, మీరు ఫైల్ చేసిన రిటర్న్‌ను ధృవీకరించాలి. ఇ-వెరిఫై తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్/ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పని ప్రారంభం అవుతుంది. మీరు మీ రిటర్న్‌ను ఎంత త్వరగా వెరిఫై చేస్తే, రిఫండ్ అంత త్వరగా మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.
తగ్గింపులు, మినహాయింపుల గుర్తింపు
పన్ను విధించదగిన ఆదాయం నుంచి మీరు క్లెయిమ్ చేయగల డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్‌ను సరిగ్గా, పూర్తి అవగాహనతో లెక్కించండి. లేదా, బాగా అనుభవం ఉన్న వాళ్ల సాయం తీసుకోండి. దీనివల్ల, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా, గరిష్ట రిఫండ్ తీసుకోవడం సాధ్యమవుతుంది.
మరో ఆసక్తికర కథనం: డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి! - సరైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?