Congress Maharashtra Allies Seat Sharing: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పొత్తుల విషయంలో క్లారిటీ తెచ్చుకునే పనిలో పడింది. ఇప్పటికే యూపీలో లెక్కలు తేల్చింది. అటు పంజాబ్, ఢిల్లీ, హరియాణాలోనూ దాదాపు స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రపై ఫోకస్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే శివసేన (UBT)తో పాటు శరద్ పవార్‌ NCPతో పొత్తు లెక్కలు మాట్లాడుతోంది. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో దాదాపు 39 చోట్ల కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మిగతా 9 సీట్ల విషయంలో మాత్రం ఇంతా చర్చలు కొనసాగుతున్నాయి. ముంబయిలోని రెండు కీలక నియోజకవర్గాల విషయంలో కాంగ్రెస్, UBT మధ్య కాస్త పట్టుదలగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఆ సీట్‌లను వదులుకోడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అటు Vanchit Bahujan Aghadi చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ ఐదు సీట్‌లు కావాలని కాంగ్రెస్‌ని డిమాండ్ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ 47 చోట్ల పోటీ చేసింది. కానీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో 236 చోట్ల పోటీ చేసిన VBA ఖాతా తెరవలేకపోయింది. ఇలాంటి పార్టీకి 5 సీట్లు కావాలంటే కాంగ్రెస్ ఇస్తుందా అన్నదే కీలకంగా మారింది.


2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి బీజేపీ, శివసేన కలిసే ఉన్నాయి. అప్పుడు శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 25 చోట్ల పోటీ చేసినా ఒక్క సీట్‌తోనే సరిపెట్టుకుంది. శరద్ పవార్‌ NCP 19 చోట్ల పోటీ చేసి నాలుగు నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకుంది. బీజేపీ 25 చోట్ల పోటీ చేసి అత్యధికంగా 23 సీట్లు సాధించింది. ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్‌కి షాక్‌లు తగిలాయి. ముఖ్యంగా ఈ మధ్యే మహారాష్ట్రలో సీనియర్ నేత అశోక్ చవాన్ కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పారు. అటు యూపీలోనూ కొంత మంది నేతలు పార్టీని వీడారు. అందుకే...ఈ రెండు రాష్ట్రాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది కాంగ్రెస్. అయితే...ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయింది. అందుకే ఉద్దవ్ థాక్రే శివసేన కాంగ్రెస్ డిమాండ్‌లకు తలొగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ...రాహుల్ గాంధీ ఉద్ధవ్ థాక్రేకి కాల్ చేసి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. 


ఆప్‌, కాంగ్రెస్ మధ్య సానుకూల చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ సీట్ షేరింగ్ విషయం ఓ కొలిక్కి వచ్చినట్టే అని తెలుస్తోంది. ABP News సోర్సెస్‌ ప్రకారం...ఢిల్లీలో ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా...కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు వచ్చాయి. న్యూ ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో ఆప్ పోటీ చేయనున్నట్టు సమాచారం. తూర్పు ఢిల్లీ, ఈశన్య ఢిల్లీ, చాందినీ చౌక్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. అటు యూపీలోనూ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీకి మధ్య సయోధ్య కుదిరింది. 


Also Read: Ideas of India 2024: అయోధ్య రామ మందిరం హిందుత్వాన్ని బలపరిచింది - ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్