ABP Ideas of India 2024: ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న Ideas of India Summit 2024 లో ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కీలక విషయాలు ప్రస్తావించారు. పీపుల్స్ ఎజెండాయే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. రెండ్రోజుల ఈ సదస్సుని ప్రారంభించిన ఆయన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించారు. ఈ ఆలయం నిర్మాణం తరవాతే భారత్‌ని హిందుత్వ దేశంగా గుర్తించాలన్న ఆకాంక్ష అందరిలోనూ పెరిగిందని వెల్లడించారు. 


"ప్రజలే ఎజెండాగా ఈ సమ్మిట్ జరుగుతోంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. ప్రజాస్వామ్యం, అభివృద్ధే భారత దేశ పునాదులు అని చరిత్రకారుడు సునీల్ ఖిల్నానీ అన్నారు. ఇప్పుడా మాటల్ని గుర్తు చేసుకోవాలి. అయోధ్యలో ఎప్పుడై రామ మందిర నిర్మాణం మొదలైందో అప్పటి నుంచే భారత్‌ని హిందుత్వ దేశంగా గుర్తించాలన్న ఆకాంక్ష పెరిగింది. 2018లో RSS చీఫ్ మోహన్ భగవత్ ఓ విషయం చెప్పారు. హిందుత్వం బలపడాలని, కానీ అది ఇతర మతాలని అణిచివేసే విధంగా ఉండకూడదని అన్నారు. హిందుత్వం అందరినీ కలుపుకుపోతుందని చెప్పారు. అయోధ్య రామ మందిరంతో ఒక్కసారిగా భారత్ కీర్తి ప్రతిష్ఠలు పెరిగాయి"


- అతిదేబ్ సర్కార్, ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ 



ఈ సందర్భంగా RSS చీఫ్ మోహన్ భగవత్ హిందుత్వం గురించి నిర్వచనాన్ని ప్రస్తావించారు అతిదేబ్ సర్కార్. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు త్యాగాలూ హిందుత్వానికి పునాదులు అని వెల్లడించారు. ఆధ్యాత్మికతపైన అధ్యయనాలు చేయడంతో పాటు అటు రకరకాల తత్త్వాలపై చర్చలు జరిపేందుకు ఎప్పుడూ వెనకాడలేదని మోహన్ భగవత్ చెప్పినట్టు గుర్తు చేశారు.


"ఆధ్యాత్మికత, మతం, ప్రభుత్వం ఈ మూడూ కలిసికట్టుగా ఉంటే ఎలా ఉంటుందో జనవరిలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతోనే అందరికీ అర్థమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాముడే భారత దేశ విశ్వాసం, రాముడే భారత దేశ పునాది, రాముడే భారత దేశ సిద్ధాంతం, రాజ్యాంగం అని అన్నారు. 1981-96 మధ్య కాలంలోని వాళ్లే నరేంద్ర మోదీ 2019లో మరోసారి ఎన్నికవడంలో కీలక పాత్ర పోషించారని, ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని వివాన్ మర్వహా చెప్పారు. కానీ..1997-2010 మధ్యలో జన్మించిన వాళ్లు మాత్రం వైవిధ్యంగా ఆలోచిస్తున్నట్టు కొంతమంది పరిశోధకులు వెల్లడించారు. Gen Z తరం వాళ్లు తల్లిదండ్రుల మాట కన్నా స్నేహితుల మాటలకే ఎక్కువగా విలువనిస్తున్నారు"


- అతిదేబ్ సర్కార్, ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్


రాజకీయాల్లో మార్పు అవసరం..


సామాజిక, ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణంపై దృష్టి సారించడం, జాతీయ భద్రతకు ప్రాధాన్యతనివ్వడం చాలా ముఖ్యం అని అతిదేబ్ సర్కార్ స్పష్టం చేశారు. దేశ ప్రజంలదరినీ ఐక్యంగా ఉంచడంతో పాటు వ్యక్తిగతంగా అందరికీ సరైన హోదా ఉండేలా చూడల్సిన అవసరముందని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పులు రావాలని ఆకాంక్షించారు.


Also Read: Ideas of India 2024: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ప్రజల కోసమే - ABP సీఈవో అవినాశ్ పాండే