ABP Ideas of India 2024: ABP Network ఆధ్వర్యంలో Ideas of India థర్డ్ ఎడిషన్ సమ్మిట్ జరుగుతోంది. ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే, ఎడిటర్ ఇన్ చీఫ్ అతిదేబ్ సర్కార్, ABP Pvt Ltd సీఈవో ధ్రుబా ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాశ్ పాండే అతిథులందరికీ ఆహ్వానం పలికారు. అమెరికన్ బేస్‌బాల్ మూవీలోని డైలాగ్‌ని ప్రస్తావించారు. "If you make it, they will come" అంటూ అందరినీ స్వాగతించారు. ఇదే సమయంలో  Ideas of India summit ప్రాధాన్యతని వివరించారు. గతంలో జరిగిన రెండు ఎడిషన్స్‌ విజయవంతం అయ్యాయని వెల్లడించిన అవినాశ్ పాండే...అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఎన్నికలతో పాటు వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావించారు. 


"2022లో మేము  Idea of India ఫస్ట్ ఎడిషన్‌ని ప్రారంభించాం. ఆ సమయంలో మాకు చాలా అనుమానాలున్నాయి. స్పందన ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ అది విజయం సాధించింది. ఆ తరవాత మరో ఎడిషన్‌ని నిర్వహించేందుకు మాకు ఉత్సాహాన్నిచ్చింది. మరీ పెద్ద కలలు కంటున్నారేమో అంటూ మా గురించి కొందరు మాట్లాడారు. అలాంటి పెద్ద కలలు కనకపోతే అది జీవితం ఎలా అవుతుంది..? గతంలో నిర్వహించిన రెండు ఎడిషన్స్‌ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మూడో ఎడిషన్‌తో మీ అందరి ముందుకు వచ్చాం"


- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో



వాతావరణ మార్పుల గురించీ మాట్లాడారు ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలూ నమోదవుతాయని అన్నారు. అడవులు తగలబడిపోవడం, గ్లేషియర్స్‌ కరిగిపోవడం లాంటి విపత్తులు చూడాల్సి వస్తుందని వెల్లడించారు. ఎన్నికల సరళి గురించీ ప్రస్తావించారు. 


"ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా అన్నది వేచి చూడాలి. కానీ...ప్రజలు మాత్రం తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పేందుకు ఎన్నికలే వేదికగా మారుతున్నాయి. ఇక ఈ సారి వాతావరణ మార్పుల గురించీ మాట్లాడుకోవాలి. ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అడవులు తగలబడిపోతాయి. గ్లేషియర్స్‌ వేడికి కరిగిపోతాయి. గాలి, నీరు, భూమిలోని కాలుష్యం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. Ideas Of India 3.0 సమ్మిట్ ప్రజల ఎజెండాగా నిర్వహిస్తున్నాం"


- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో


Ideas of India Summit 2024 లో ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కీలక విషయాలు ప్రస్తావించారు. పీపుల్స్ ఎజెండాయే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. రెండ్రోజుల ఈ సదస్సుని ప్రారంభించిన ఆయన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించారు. ఈ ఆలయం నిర్మాణం తరవాతే భారత్‌ని హిందుత్వ దేశంగా గుర్తించాలన్న ఆకాంక్ష అందరిలోనూ పెరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా RSS చీఫ్ మోహన్ భగవత్ హిందుత్వం గురించి నిర్వచనాన్ని ప్రస్తావించారు అతిదేబ్ సర్కార్. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు త్యాగాలూ హిందుత్వానికి పునాదులు అని వెల్లడించారు.