Election Results 2024: యూపీలోని అమేథి నియోజకవర్గంలో స్మృతి ఇరానీకి ఓటమి తప్పేలా లేదు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం 76 వేల ఓట్లతో లీడ్‌లో ఉన్నారు కిషోరి లాల్. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. కానీ..ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి స్మృతి ఇరానీపై గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ మెజార్టీతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకోనుంది. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ కీలక ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్‌పై ప్రశంసలు కురిపించారు. "మీరు గెలుస్తారన్న నమ్మకముంది" అని ధీమా వ్యక్తం చేశారు.
"కిషోరి భయ్యా మీ పేరు ప్రకటించినప్పటి నుంచి నేనెప్పుడూ అనుమానపడలేదు. మీరే కచ్చితంగా గెలుస్తారన్న నమ్మాను. అదే జరుగుతుంది. మీకు అమేథి ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
అమేథి నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న ఈ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సారి రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ వినిపించింది. అయితే..గత ఎన్నికల్లో ఆయన ఇక్కడే పోటీ చేసి ఓడిపోయారు. అందుకే...ఆయనను అమేథి బరి నుంచి తప్పించి రాయ్‌బరేలీకి పంపింది కాంగ్రెస్. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ పేరుని ప్రకటించింది. ప్రధాని మోదీ సహా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌పై సెటైర్లు వేశారు. తప్పించుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. కానీ...ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాయ్‌బరేలీతో పాటు వయనాడ్‌లోనూ రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఈ రెండు చోట్లా భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.