NDA Vs I.N.D.I.A: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఫలితాలపై ఇప్పటికే ఓ అంచనా వచ్చింది. 400 స్థానాలు గెలుచుకోవాలని భారీ లక్ష్యం పెట్టుకున్న బీజేపీ కచ్చితంగా ఆ టార్గెట్‌ని కొడతామని ధీమాగా ప్రచారం చేసుకుంది. ఇక మోదీ సర్కార్‌ని గద్దె దించేందుకు I.N.D.I.A కూటమి ఏర్పాటైంది. ఎలాగైనా మోదీ వేవ్‌కి బ్రేక్‌లు వేయాలని పెద్ద టార్గెట్‌నే నిర్దేశించుకుంది. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తుంటే కూటమి అనుకున్నదని సాధించినట్టే కనిపిస్తోంది. అత్యంత కీలకమైన యూపీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో NDAకి గట్టిపోటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎగ్జిట్‌ పోల్ అంచనాలనూ తలకిందులు చేస్తూ దాదాపు 220 స్థానాలకు పైగా లీడ్‌లో దూసుకుపోతోంది. అటు NDA 300 మార్క్ సాధించడమూ కాస్త కష్టంగానే కనిపిస్తోంది. అసలు ఏ మాత్రం ప్రభావం చూపించదని, తుక్‌డే గ్యాంగ్‌ అని విమర్శలు ఎదుర్కొన్న ప్రతిపక్ష కూటమి ఈ స్థాయిలో ఎలా ఎఫెక్ట్ చూపించింది..? బీజేపీ 400 లక్ష్యానికి ఎలా బ్రేక్‌లు వేయగలిగింది..? 


మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందా..?


దాదాపు పదేళ్లుగా భారత రాజకీయాల్ని శాసిస్తున్న పేరు ప్రధాని మోదీ. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర నేతగా రికార్డు సృష్టించారు. ఇప్పట్లో ఆయనకు తిరుగే లేదు అన్న స్థాయిలో ఓ మేనియా క్రియేట్ చేశారు. కానీ...ఈ సారి మాత్రం ఆ ప్రభావం కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దెబ్బ కొట్టి ఉండొచ్చని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ని విమర్శించే క్రమంలో ముస్లింలపై నేరుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన చరిష్మాకి తగిన విధంగా లేవనేది బాగా వినిపించిన వాదన. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ కాక ఇంకెవరు అనే నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ..ఈ సారి మాత్రం హిందూ ముస్లిం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బహుశా ఇది కొంత వరకూ ప్రభావం చూపించి ఉండొచ్చు. 



ఇది కూడా ఓ కారణమేనా..?


పోలింగ్ విషయంలో భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించినప్పటికీ మొత్తంగా చూసుకుంటే దశల వారీగా చూసుకుంటే పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు శాతం 67.4%,ఈ సారి అది 65%కి పరిమితమైంది. పోలింగ్ శాతం తగ్గడమూ NDA,ఇండీ కూటమి మధ్య టఫ్‌ ఫైట్‌కి కారణమై ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఇండీ కూటమిని ఘమండియా అలియన్స్ అంటూ ప్రధాని మోదీ పదేపదే చురకలు అంటించారు. అదో అతుకుల బొంత అని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో వారసత్వ రాజకీయాల గురించీ ప్రస్తావించారు. కానీ...యూపీలో ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ NDAనే వెనక్కి నెట్టాయి. అంటే..వారసత్వ రాజకీయల వాదనను ప్రజలు తిరస్కరించినట్టే కనిపిస్తోంది. పొంతన కుదరని కూటమి అని విమర్శలు ఎదుర్కొన్న I.N.D.I.A అలియన్స్ ఇప్పుడు మోదీకే పోటీ ఇచ్చే స్థాయికి ఎదగడం ఎవరూ ఊహించని పరిణామం. 


 Also Read: Elections 2024 Results: ఒడిశాలో కాషాయ దళం జోరు, అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్ - తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం