Elections 2024 Results: ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కి బీజేపీ షాక్ ఇచ్చేలా ఉంది. సగానికిపైగా స్థానాల్లో కాషాయ దళం దూసుకుపోతోంది. మొత్తం 147 స్థానాలున్న ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుకి 74 మెజార్టీ మార్క్ రావాలి. ప్రస్తుత ట్రెండ్‌ని చూస్తుంటే...బీజేపీ మొత్తం 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ (BJD) వెనకబడిపోయింది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్టవుతుంది. దాదాపు 25 ఏళ్లుగా నవీన్ పట్నాయక్‌ ఇక్కడ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పాతికేళ్ల పాలనకు బీజేపీ తెరవేసే అవకాశాలున్నాయి. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం...బీజేపీ 78 చోట్ల లీడ్‌లో ఉండగా బీజేడీ 54 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ 11 చోట్ల, సీపీఐ (M) ఓ చోట లీడ్‌లో ఉన్నాయి. 



ఇటీవలే నవీన్ పట్నాయక్‌ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని, దీని వెనకాల ఏదో కుట్ర ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరవాత దీనిపై ఓ కమిటీ వేస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది. కానీ ఈ సారి భారీగా పుంజుకుంది. మన్మోహన్ సమాల్‌ నేతృత్వంలోని బీజేపీ ఒడిశాలో 147 చోట్లా పోటీ చేసింది. బీజేపీ, బీజేడీ ఒకప్పుడు కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు విడివిడిగా పోటీ చేశాయి.