Election Results 2024: 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమి ప్రస్తుతానికి లీడ్‌లో ఉంది. అయితే...ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే అసలు ఏ మాత్రం ప్రభావం చూపించదు అనుకున్న I.N.D.I.A కూటమి గట్టిగానే పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం 299 చోట్ల NDA లీడ్‌లో ఉండగా  పోటాపోటీగా ఇండీ కూటమి 221 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎవరూ ఊహించని విధంగా పలు చోట్ల పోటీ ఇస్తోంది. అటు యూపీలోనూ బీజేపీకి గట్టిగానే పోటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.


 



తుక్‌డే గ్యాంగ్ అంటూ మోదీతో సహా పలువురు బీజేపీ నేతలు గట్టిగానే విమర్శలు చేశారు. అందుకు తగ్గట్టుగానే కూటమిలో చీలికలు వచ్చాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించాయి పార్టీలు. కానీ ఎన్నికల ముందు మళ్లీ కలిశాయి. NDAని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేశాయి. ప్రస్తుత ట్రెండ్‌ని చూస్తుంటే ఆ వ్యూహాలు ఫలించినట్టే కనిపిస్తోంది. ఇవి తుది ఫలితాలు కావు కాబట్టి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం. కానీ ఇప్పటికైతే ఇండీ కూటమి గట్టి పోటీ ఇస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది.