Lok Sabha election 2024 Phase 4 Polling Updates: మొత్తం 10 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే...గత మూడు విడతల్లో పోలింగ్ శాతం కొంత వరకూ తగ్గిపోయింది. విపరీతమైన ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా కొంత మంది బయటకు వచ్చి ఓటు వేసేందుకు వెనకాడారు. ఫలితంగా ఆ మేరకు పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అయితే...ఈ నాలుగో దశ పోలింగ్ సమయానికి కాస్తంత వాతావరణం చల్లబడింది. ఉక్కపోత కూడా తగ్గింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఎన్నికల అధికారులు. భారత వాతావరణ విభాగం (IMD) కూడా కీలక ప్రకటన చేసింది. వాతావరణం సాధారణంగానే ఉంటుందని, నాలుగో దశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా వేసింది. సాధారణంగా పోలింగ్ 6 గంటలకు ముగిసిపోతుంది. కానీ...కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ముగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓటర్లకు ఎన్నికల అధికారులు సమాచారం అందించారు. పోలింగ్ వేళల్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 


అటు ఎన్నికల సంఘం కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సారి పోలింగ్‌పై ఉష్ణోగ్రతల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేసింది. పోలింగ్ ఉన్న ప్రాంతాల్లో సాధారణానికి మించి 2 డిగ్రీలు లేదా అంత కన్నా తక్కువే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ పోలింగ్‌ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఫ్యాన్‌లతో పాటు తాగునీరు కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. గత కొద్దిరోజులుగా వడగాలులు వీస్తుండడం వల్ల మధ్యాహ్నం పూట చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అందుకే పోలింగ్ వేళల్ని పొడిగించారు. మొత్తం 543 నియోజకవర్గాలున్న లోక్‌సభలో ఇప్పటి వరకూ మూడు విడతల్లో 283 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తైంది. కానీ...2019లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ మూడు విడతల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో 66.14%, రెండో విడతలో 66.71%, మూడో విడతలో 65.68% పోలింగ్ నమోదైంది.