Lok Sabha Elections 2024:


తీవ్ర అసహనం..


శివసేన పార్టీ పేరు, గుర్తుని కోల్పోయిన థాక్రే సేన తీవ్ర అసహనంతో ఉంది. ఎన్నికల సంఘం శిందే వర్గానికి వాటిని కేటాయించడంపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన సామ్‌నా పత్రికలో ఎడిటోరియల్ రాసిన థాక్రే...వేరువేరుగా బీజేపీపై పోరాటం చేయలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వాన్నీ ప్రస్తావించారు. 


"మనం బీజేపీపై పోరాటం చేయాలంటే ఇలా వేరువేరుగా ఉంటే అది కుదరదు. మనమంతా కలిసి మెరుపు దాడి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేదు. ప్రతిపక్షాలు ఐక్యం కావడమే చాలా కీలకం" 


- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 


2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్నీ ఈ సంపాదకీయంలో చర్చించారు థాక్రే. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందామని స్పష్టం చేశారు. ఇది తరవాత నిర్ణయించుకుందామంటూ ప్రతిపక్షాలకు సూచించారు. 


"అందరూ ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న ఆలోచనలో ఉన్నారు. అది తరవాత నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటుందని, ఆ స్వేచ్ఛ ఇవ్వాలని నితీష్ కుమార్ అన్నారు. కొందరు నా పేరు కూడా ప్రస్తావించారు. కానీ ప్రస్తుతానికి నాకా ఉద్దేశం లేదు" 
- సామ్నా పత్రికలో ఉద్దవ్ థాక్రే 


ఇక ఎన్నికల ప్రక్రియపైనా ఆరోపణలు చేశారు థాక్రే. ఇజ్రాయేల్‌కు చెందిన ఓ టీమ్‌కి డబ్బులిచ్చి మరీ EVM స్కామ్‌కు పాల్పడుతున్నారంటూ బీజేపీపై మండి పడ్డారు. ఇది అందరికీ తెలిసి నిజమేనని వెల్లడించారు. బీజేపీ వైఖరికి బుద్ధి చెప్పాలంటే 
ప్రతిపక్షాలు ఏకమవడమొక్కటే మార్గమని స్పష్టం చేశారు. 


ఈ మధ్యే ఉద్దవ్ థాక్రే...ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిందేపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరుని, గుర్తుని శిందే వర్గానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరుని దొంగిలించారంటూ మండి పడ్డారు. శివసేన పార్టీకి చెందిన పేరుని, పార్టీ గుర్తుని ఏక్‌నాథ్ శిందేకి కేటాయిస్తూ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దీనిపై తీవ్ర అసహనానికి గురవుతోంది థాక్రే సేన. శిందేపై చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న థాక్రేకు పెద్ద దెబ్బే. 


"మా పార్టీ గుర్తుని దొంగిలించారు. ఆ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి. ఆ దొంగ ఎవరో అందరికీ తెలుసు. ఇప్పటికే పట్టుబడ్డాడు కూడా. నేనా దొంగకు సవాల్ విసురుతున్నాను. బాణం విల్లుతో వచ్చి ఎదురు నిలబడితే...కాగడాలతో బదులు చెబుతాం. వాళ్లకు కావాల్సింది శివసేన కుటుంబం కాదు. కేవలం బాలాసాహెబ్‌ థాక్రే పేరు మాత్రమే.  ఆ పార్టీ గుర్తు ఉంటే చాలు. ప్రధాని నరేంద్ర మోదీ బాలాసాహెబ్ మాస్క్‌ వేసుకోవాలని చూస్తున్నారు. మహారాష్ట్రకు రావడానికి అదో మార్గం అని భావిస్తున్నారు. ఏది నిజమైన ముఖమో, ఏది కాదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు" 


-ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం


Also Read: Emergency Landing: ఫ్లైట్ ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్,ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసిన పైలట్‌