Lok Sabha Election 2024:


బీజేపీ ముందంజ..


వరుస అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి. ఉప ఎన్నికైనా సరే...పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ హడావుడి కొనసాగుతుండగానే..రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అప్పుడే ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. అధికార బీజేపీ ఈ విషయంలో ముందంజలో ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి తమ బలాన్ని చాటి చెప్పిన కాషాయ పార్టీ...హ్యాట్రిక్‌కు 
సిద్ధమవుతోంది. ఈ సారి కూడా విజయం సాధించి..తిరుగులేని పార్టీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడే ఇందుకోసం రూట్‌మ్యాప్ సిద్ధమవుతోంది. "మిషన్ 2024" ఎజెండాపై అందరూ మేధోమథనం సాగిస్తున్నారు. ఈసారి బీజేపీ సెంట్రల్ ఆఫీస్‌లోనే అధికారిక సమావేశం ఏర్పాటు చేసుకుంది బీజేపీ అధిష్ఠానం. 2024 ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే ఓ స్పష్టత ఉండాలని తేల్చి చెబుతోంది అధిష్ఠానం. ఆ మేరకు సీనియర్ నేతలంతా భేటీ అవుతున్నారు. అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని..తమ రిపోర్ట్ కార్డులు సమర్పించాల్సి ఉంటుంది. తమ రాష్ట్రాల్లో పురోగతి ఎంత వరకు వచ్చిందో స్పష్టంగా అందులో ప్రస్తావించాలి. వీటితో పాటు గుజరాత్, 
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైనా నేతలంతా చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికలపై చాలా రోజులుగా బీజేపీ అధిష్ఠానం అన్ని రాష్ట్రాల నేతలనూ అప్రమత్తం చేస్తూనే ఉంది. తరచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ...అలర్ట్ చేసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నోసార్లు ఇలాంటి భేటీలు జరిగాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహా 2024 ఎన్నికల మిషన్‌పైనా సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ తమ రిపోర్ట్‌ కార్డులు అధిష్ఠానానికి సమర్పించాలి. 


ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు..


2024 లోక్‌సభ ఎన్నికలకు నిండా రెండేళ్ల సమయం కూడా లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంది. ఇటు బీజేపీ కూడా తమ విజయ పరంపరను కొనసాగించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీలో మరింత జోష్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా మళ్లీ కలుస్తున్నాయి. ఎలాగైనా బీజేపీని ఢీకొట్టి తమ బలం నిరూపించుకోవాలని చూస్తున్నాయి. ప్రధానిరేసులో ఉన్నారన్న నితీష్ కుమార్ కూడా మిషన్ 2024కి రెడీ అవుతున్నారు. పలుమార్లు ఢిల్లీలో పర్యటించారు. జాతీయస్థాయి నేతల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ TRSని BRSగా మార్చేశారు. ప్రాంతీయపార్టీగా పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని ఆయన సిద్ధమయ్యారు. యాక్షన్ ప్లాన్‌ కూడా అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధాని మోడీని ఢీకొట్టేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి...దేశ రాజకీయాల్లో అప్పుడే 2024 ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. 


Also Read: Modi Dirict War With KCR : టీఆర్ఎస్‌పై తొలి సారి మోదీ డైరక్ట్ ఎటాక్ - ఇక మరింత దూకుడుగా బీజేపీ రాజకీయం !