Restaurants in India: వీకెండ్ వస్తే చాలు. ఎక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా ఓ టూర్ వేసొస్తారు చాలా మంది. ఇక ఫుడీస్ అయితే సిటీలో ఏయే రెస్టారెంట్‌లు కొత్తగా వచ్చాయ్..? రివ్యూస్ ఎలా ఉన్నాయని చూసుకుని అక్కడికి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇన్‌స్టా రీల్స్‌లో రెస్టారెట్‌ల లిస్ట్ చూసుకుని వెళ్తున్న వాళ్లూ ఉన్నారు. అయితే...ఆహార ప్రియులకు ఎన్నో దశాబ్దాలుగా నోరూరిస్తున్న రెస్టారెంట్‌లున్నాయి. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఇవి ఉన్నాయి. తరాలు ఎన్ని మారుతున్నా ఆ రెస్టారెంట్‌లకు ఉన్న ఫేమ్ మాత్రం తగ్గడం లేదు. 1947కి ముందు నుంచే ఉన్నా ఇప్పటికీ వాటి డిమాండ్ మాత్రం అలాగే కొనసాగుతోంది. పైగా వింటేజ్ ఫీల్ ఇస్తుండడం వల్ల ఫుడీస్ అంతా క్యూ కడుతూనే ఉన్నారు.
ఈ లిస్ట్‌లో మొట్టమొదట చెప్పుకోవాల్సింది కోల్‌కత్తాలోని ఇండియన్ కాఫీ హౌజ్. కాలేజ్ స్ట్రీట్‌లో ఉండే హోటల్‌ని 1876లో ప్రారంభించారు. ముందుగా దీన్ని ఆల్బర్ట్ హాల్‌గా పిలుచుకునే వాళ్లు. 1942లో ఇండియన్ కాఫీ హౌజ్‌గా (Indian Coffee House) పేరు మార్చారు. అప్పట్లో ఎంతో మంది మేధావులు, రాజకీయ నేతలు, కళాకారులు ఇక్కడికి వచ్చి కాఫీ తాగేవాళ్లు. వీళ్లలో సుభాష్ చంద్రబోస్‌తో పాటు ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు. కాఫీతో పాటు ఇక్కడ ఇచ్చే స్నాక్స్ నోరూరిస్తాయి. అందుకే..కోల్‌కత్తాకి వెళ్లిన వాళ్లు కచ్చితంగా ఈ కాఫీ హౌజ్‌ని విజిట్ చేసి వస్తారు.
(Image Credits: Wikipedia)
ఇక కర్ణాటకలోని బెంగళూరులో మావళ్లి టిఫిన్ రూమ్ (MTR) కూడా ఈ జాబితాలో ఉంది. 1924లో మొదలైన ఈ హోటల్ సౌత్ ఇండియన్ ఫుడ్‌కి చాలా ఫేమస్. ముఖ్యంగా ఇడ్లీ, దోశతో పాటు ఫిల్టర్ కాఫీ కోసం ఫుడీస్ ఎగబడతారు. వెజిటేరియన్లకూ ఇది మంచి స్పాట్. దాదాపు వందేళ్లుగా ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆహార కొరతను తీర్చేందుకు రవ్వ ఇడ్లీని కనిపెట్టింది ఈ MTR హోటలే. టేస్ట్, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకపోవడం వల్ల ఆ పేరు చెక్కచెదరలేదు.
(Image Credis: cntraveller)
ముంబయిలోని బ్రిటానియా అండ్ కంపెనీని 1923లో స్థాపించారు. పార్శీ వంటకాలకు ఈ హోటల్ చాలా ఫేమస్. బలార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉండే ఈ హోటల్‌లో బెర్రీ పలావ్‌ని ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటారు. వింటేజ్ ఫర్నిచర్ అందరినీ అట్రాక్ట్ చేసేస్తుంది. బొమన్ కోహినూర్ ఈ హోటల్‌ని స్థాపించాడు. అప్పట్లో అతిథులను ఆయనే ఆహ్వానించి వాళ్లకు ఏం కావాలో అడిగి మరీ ఆర్డర్లు తీసుకునే వారని చెబుతారు. లక్నోలోని తుండే కబాబీ (Tunday Kababi) 1905 నుంచి ఫేమస్. నోరూరించే కబాబ్‌లు ఇక్కడ దొరుకుతాయి. ఈ హోటల్‌ని హాజీ మురద్ అలీ ప్రారంభించాడు. ఓ చేయి లేకపోయినా సరే కబాబ్‌లు చేయడంలో మాత్రం ఆయన స్టైలే వేరట. ఇప్పుడు ఇక్కడ కబాబ్‌లతో పాటు బిర్యానీ కూడా మెనూలో చేర్చారు. ఢిల్లీలోని జామా మసీద్ వద్ద కరీమ్స్ రెస్టారెంట్‌లో మొఘలాయ్ ఫుడ్ మెనూ ఉంటుంది. మటన్ కూర్మా, కబాల్‌ల కోసం ఫుడీస్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు.
Also Read: Ageing: మనమంతా రెండు సార్లు ముసలి వాళ్లమైపోతామట, మొదటి వృద్ధాప్యం వచ్చేది అప్పుడే