Imran Khan Arrest: 


అరెస్ట్‌పై ఆందోళనలు..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్‌ని అక్రమం అని తేల్చి చెప్పినా...ప్రభుత్వం మాత్రం ఆయనపై కఠినంగానే వ్యవహరిస్తోంది. మే 9వ తేదీన అల్‌ ఖదీర్ ట్రస్ట్ కేసులో అరెస్ట్ అయ్యారు ఇమ్రాన్. రెండ్రోజుల తరవాత బెయిల్ వచ్చింది. ఆ తరవాతే ఆ దేశం రణరంగమైంది. ఇమ్రాన్ సపోర్టర్స్‌ రోడ్లపైకి వచ్చి నానా రచ్చ చేశారు. ఆర్మీపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో దాదాపు వెయ్యి మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్మీ యాక్ట్ కింద ఆందోళనకారులపై కేసు పెడతామని ఆర్మీ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు ఇమ్రాన్‌కీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది సైన్యం. వీలైనంత త్వరగా దేశం నుంచి వెళ్లిపోవాలని, లేకపోతే ఆర్మీయాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. దుబాయ్‌ లేదా లండన్‌కు వెళ్లిపోవాలని హెచ్చరించింది. దేశం విడిచి వెళ్లిపోతే ఎలాంటి కేసు నమోదు చేయమని వెల్లడించింది. 


ఎక్కడికీ కదలను: ఇమ్రాన్ 


అయితే...ఆర్మీ వార్నింగ్‌పై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏం జరిగినా పాకిస్థాన్‌ నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్...ఇమ్రాన్ మద్దతుదారులకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నిస్తే దేనికైనా తెగిస్తాం అని అన్నారు. పాక్‌లో ఆర్మీకే అధికారాలు ఎక్కువ. చెప్పాలంటే...సైన్యం చేతుల్లోనే ప్రభుత్వం నడుస్తుంది. ఆర్మీ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పింది. ఇది అమల్లోకి వస్తే...సైన్యానికి అన్ని అధికారాలు వచ్చేస్తాయి. నిందితులను ఎప్పుడంటే అప్పుడు అదుపులోకి తీసుకోవచ్చు. ఇది అడ్డం పెట్టుకుని ఇమ్రాన్‌తో పాటు ఆయన సపోర్టర్స్‌కి కూడా జీవిత ఖైదు, మరణ శిక్ష వేయాలని చూస్తోంది. 


సుప్రీంకోర్టు విచారణ..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా అక్రమేనని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగానే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో భయానక వాతావరణం సృష్టించారంటూ మండి పడ్డారు. కోర్టులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. ఎవరినైనా సరే కోర్టులో అరెస్ట్ చేయడం అక్రమం అని తేల్చి చెప్పింది. గంటలోగా ఇమ్రాన్‌ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఇమ్రాన్‌ ఖాన్ కోర్టుకి వచ్చే సమయంలో రాజకీయ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కోర్టులోకి రావద్దని హెచ్చరించారు చీఫ్ జస్టిస్. 


"ఓ వ్యక్తి కోర్టులో హాజరయ్యారంటేనే చట్ట పరంగా అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తిని కోర్టులోనే అరెస్ట్ చేయడంలో అర్థమేంటి..? భవిష్యత్‌లో ఇంకెవరైనా సరే కోర్టుకి రావాలన్నా భయపడతారు. అక్కడా భద్రతా లేదని భావిస్తారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి"


- చీఫ్ జస్టిస్, పాకిస్థాన్ సుప్రీంకోర్టు 


Also Read: పెళ్లి మండపంలోనే విషం తాగిన జంట - వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం