Surrogacy Coverage: భవిష్యత్ సన్నద్ధత, పెట్టుబడి, పొదుపు పరంగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యమైన విషయం. కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్య బీమా ప్రయోజనాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా, ఆరోగ్య బీమా పరిధిని పెంచుతూ 'బీమా నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ' ఇర్డాయ్ (IRDAI) ఆదేశాలు జారీ చేసింది.
రెండు చట్టాల ప్రకారం బీమా కవరేజీ
బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం, సరోగసీ ఖర్చులను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల పరిధిలోకి బీమా నియంత్రణ సంస్థ తీసుకొచ్చింది. శారీరక ఆరోగ్య పరిస్థితి కారణంగా సంతానం లేక సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాలు పిల్లల కోసం సరోగసీ (అద్దె గర్భం) మార్గాన్ని ఆశ్రయిస్తే, ఆ సందర్భంలో సరోగసీ ఖర్చులకు కవరేజీని అందించాలని బీమా కంపెనీలను IRDAI ఆదేశించింది. దీని కోసం, అన్ని బీమా కంపెనీలు సరోగసీ చట్టం 2012, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం (ART చట్టం) 2021ని ఫాలో అవ్వాలని ఇన్సూరెన్స్ మార్కెట్ రెగ్యులేటర్ సూచించింది.
పైన చెప్పిన రెండు చట్టాల నిబంధనలను తక్షణం పాటించాలి, రూల్స్‌కు తగ్గట్లుగా తగిన బీమా పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని బీమా కంపెనీలకు IRDA స్పష్టం చేసింది. సరోగసీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, సరోగసీ ఖర్చులకు బీమా కవరేజీ అందుతుంది. ప్రసవం అనంతరం ఎదురయ్యే సమస్యలకు చికిత్స ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది.
సరోగసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సరోగసీ (నియంత్రణ) చట్టం-2021 ప్రకారం... భారత్‌లో వివాహం చేసుకున్న జంట లేదా విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన ఒంటరి మహిళ మాత్రమే సరోగసి ద్వారా బిడ్డలు కనవచ్చు. ఈ వ్యక్తులకు చెందిన బిడ్డను ఒక మహిళ తన గర్బంలో పెంచుతుంది. బిడ్డను గర్భంలో పెంచే సదరు మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కు ఉండదు. అండం, వీర్యం ఇచ్చిన వ్యక్తులు మాత్రమే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవుతారు. వివాహ జరిగి ఐదేళ్లు పూర్తయిన దంపతులు మాత్రమే సరోగసీ సేవను పొందడానికి అర్హులు. అండం ఇచ్చే మహిళ వయస్సు 23-50 ఏళ్ల మధ్య ఉండాలి. వీర్యం ఇచ్చే పురుషుడి వయస్సు 26-55 ఏళ్ల మధ్య ఉండాలి. సరోగసీ ద్వారా పిల్లలు కోరుకునే వాళ్లకు జన్యుపరంగా లేదా దత్తత రూపంలో పిల్లలు ఉండకూడదు. సరోగేట్ తల్లి వయస్సు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆమెకు పెళ్లై ఉండడంతో పాటు, అప్పటికే కనీసం ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ఆమె జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి.
విదేశీయులకు సరోగసీ సేవలను భారత్ నిషేధించింది.
సరోగసీ (నియంత్రణ) నిబంధనలు, 2022లోని రూల్ 5 ప్రకారం... పిల్లలు కోరుకుంటున్న మహిళ లేదా దంపతులు, IRDA గుర్తింపు పొందిన బీమా కంపెనీ లేదా ఏజెంట్ నుంచి 36 నెలల కాలానికి సరోగేట్ తల్లికి అనుకూలంగా సాధారణ ఆరోగ్య బీమా కవరేజీని కొనుగోలు చేయాలి. ఇది, గర్భం ధరించాక సరోగేట్ తల్లికి ఉత్పన్నమయ్యే అన్ని సమస్యలను, ప్రసవానంతరం ఎదురయ్యే ప్రసవ సంబంధిత సమస్యలను కూడా కవర్ చేస్తుంది. అన్ని ఖర్చులను ఆ బీమా కంపెనీ భరిస్తుంది.
ART చట్టం, 2021లోని సెక్షన్ 22(1)(b) ప్రకారం... IRDA గుర్తింపు పొందిన బీమా కంపెనీ లేదా ఏజెంట్ ద్వారా 12 నెలల కాలానికి ఓసైట్ దాత లేదా జంట లేదా మహిళ కోసం సాధారణ ఆరోగ్య బీమా కవరేజీని కొనుగోలు చేయవచ్చు. ఓసైట్ రిట్రీవల్ కారణంగా ఉత్పన్నమయ్యే అన్ని సమస్యలకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేయడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.
IRDA కొత్త మార్గదర్శకం సరోగసీకి చాలా మంచి పరిణామంగా పరిగణిస్తున్నారు. పిల్లలను కనలేని, సరోగసీ పద్ధతిని అవలంబించాలనుకునే వారికి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు, సర్రోగేట్ తల్లులకు, డెలివరీ తర్వాత కూడా కొంతకాలం వరకు ఆరోగ్య సంబంధిత ఒత్తిడి ఉండదు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ జనం ఇళ్లను ఈజీగా కొని పడేస్తున్నారు!