చిన్నారుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు ఇవే 


చిన్నారులకూ కరోనా వస్తుందా..? వారిలోనూ అవే లక్షణాలు కనిపిస్తాయా..? పిల్లలకు కొవిడ్ సోకితే ప్రాణాలకే ప్రమాదమా..? రెండేళ్ల క్రితం కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో ఇలాంటి సందేహాలు ఎన్నో తెరపైకి వచ్చాయి. తల్లిదండ్రులు ఎంతో భయపడిపోయారు. అయితే పెద్దలతోపోల్చితే పిల్లలపై తక్కువగానే ప్రభావం చూపింది కరోనా. వారికీ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయ స్థితి రాలేదు. కానీ దీర్ఘకాలంగా చూస్తే వారి ఆరోగ్యంపై మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతోందని అంటున్నారు వైద్యులు. తలనొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం, పొత్తి కడుపు నొప్పి లాంటి లక్షణాలు వారిలో కనిపించాయని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలపై ఇటీవలే అధ్యయనం చేసిన లాన్సెట్ ఈ వివరాలు ప్రచురించింది. 


మూడింట ఓ వంతు పిల్లలకు అనారోగ్యం..


కొవిడ్ సోకిన పిల్లల్లో మూడింట ఓ వంతు పిల్లల్లో ఈ అనారోగ్య లక్షణాలు కనిపించినట్టు తేల్చి చెప్పింది. చిన్నారుల ఆరోగ్యం, విద్య, జీవనశైలిపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంపై అధ్యయనం చేపట్టారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతపై వైరస్ ప్రభావం తక్కువే అయినా, పోస్ట్ కొవిడ్ సమస్యలు మాత్రం అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. ప్రస్తుతానికి ఈ బాధితుల సంఖ్య తక్కువగానే ఉన్నా వీలైనంత త్వరగా సంరక్షణా చర్యలు చేపట్టాలని సూచించారు. పిల్లలపై లాంగ్ కొవిడ్‌ ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. కరోనా సోకిన వారిని దాదాపు రెండు నెలల పాటు ఏదో ఓ అనారోగ్య సమస్య వెంటాడుతోందన్నది కొందరు పరిశోధకులు చెబుతున్న మాట 2020 జనవరి నుంచి జులై 2021 వరకూ కరోనా సోకిన పిల్లలపై పరిశోధన జరిపిన తరవాతే ఈ విషయాన్ని నిర్ధరించారు. 


చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త..


మూడేళ్ల లోపు చిన్నారులకు విపరీతమైన కడుపు నొప్పి వస్తున్నట్టు గుర్తించారు. 4-11 ఏళ్ల వయసున్న పిల్లల్లో మూడ్ స్వింగ్స్, దద్దుర్లు, మతిమరుపు లాంటి లక్షణాలు కనిపించాయట. 12-14 ఏళ్ల వయసున్న వారిలోనూ నీరసం, మూడ్ స్వింగ్స్, మతిమరుపు లాంటి లక్షణాలు గుర్తించారు. కరోనా బారిన పడిన పిల్లలు మానసికంగానూ ఇబ్బందులు పడుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వారిలో నాడీ సంబంధ సమస్యలు వస్తున్నాయి. అందుకే చిన్నారులకు కరోనా సోకితే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా పిల్లల్లో ఏ అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వాళ్ల మానసిక స్థితి మారిపోతుంది. ఊరికే మారాం చేయటం, అరవటం, చిరాకు పడటం లాంటివి చేస్తుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించటం మంచిదని నిపుణులు అంటున్నారు.