India China Border:


తూర్పు లద్దాఖ్‌లో నీటి కొలనులు..


సరిహద్దులో గస్తీ కాసే సైన్యానికి ఎన్ని కష్టాలెదురవుతాయో లెక్కే లేదు. అడుగడుగునా సవాళ్లు దాటుకుంటూ ముందుకెళ్తుంటారు. ఎప్పుడు శత్రువులు దాడి చేస్తారో అని అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. సరైన తిండి, నిద్ర ఉండదు. ఇక అత్యంత సంక్లిష్టమైన భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అయితే...భౌగోళికంగా చాలా సమస్యలుంటాయి. మిగతా రోజుల్లో కంటే శీతాకాలంలో ఇవి ఎక్కువవుతాయి. అక్కడి 
చలిని తట్టుకోలేక ఇబ్బందులు పడతారు. ఎక్కడ చూసినా మంచు కనిపిస్తుంది. కనీసం గొంతు తడుపుకోటానికి కూడా నీళ్లు దొరకవు. అందుకే...సైన్యం ఈసారి ముందస్తు జాగ్రత్తగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. తూర్పు లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో పెద్ద పెద్ద నీటి కొలనులు ఏర్పాటు చేసుకుంటోంది. మంచు కురిసినా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. దాదాపు 50 వేల మంది తూర్పు లద్దాఖ్‌లో పహారా కాస్తున్నారు. ఎప్పుడు చైనా కయ్యానికి దువ్వుతుందో తెలియని పరిస్థితుల్లో ఇంత మందిని మోహరించింది భారత్. ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. "ఇక్కడ పహారా కాస్తున్న సైన్యం కోసం పెద్ద నీటి కొలనులు ఏర్పాటు చేసుకుంటున్నాం. డౌల్ట్ బెగ్ ఓల్డీ లాంటి కీలక ప్రాంతాల్లో మంచు కురిసినప్పటికీ...సైనికులు ఈ కొలనులో నుంచి స్వచ్ఛమైన నీరు తాగేందుకు అనువుగా ఉంటుంది" అని ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్‌పాల్ సింగ్ వెల్లడించారు. లద్దాఖ్‌లో..డౌల్ట్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంటుంది. అక్కడ సైన్యానికి ఆహారం, నీరు అందించటం ఆర్మీకి సవాలుతో కూడుకున్న పని. కొంత మంది ఇంజనీర్ల సాయంతో అక్కడ కాస్తైనా అనుకూల వాతావరణం కల్పించుకుంటున్నారు సైనికులు. తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యం ఎన్నో హ్యాబిటాట్స్‌ని కూడా సమకూర్చుకుంది. ఎక్కడికంటే అక్కడికి వీటిని మోసుకెళ్లే విధంగా రూపొందించుకుంది.  


రెడీగా ఉండాలన్న రాజ్‌నాథ్..


భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న వివాదం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గల్వాన్ ఘటన తరవాత అది తారస్థాయికి చేరుకుంది. చర్చలు జరుగుతున్నా చైనా ఏ మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రాగన్‌కు గట్టి బదులు చెప్తామని భారత్ ముందు నుంచి చెబుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అందుకు ఇండియా రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు. "భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి" అన్నారు రాజ్‌నాథ్. 


Also Read: Rahul Gandhi: EVMల కన్నా సోషల్ మీడియానే పవర్‌ఫుల్, ఏ పార్టీనైనా గెలిపించేస్తుంది - రాహుల్ గాంధీ