Hyderabad Traffic News: హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా - ఈ రేస్ జరగనున్నందున ఆ వేడుక జరిగే కొద్ది రోజుల పాటు కొన్ని సందర్శనీయ ప్రదేశాలు మూతపడనున్నాయి. అంతేకాక, పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయి. ఈ రేసింగ్ క్రీడ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొన్ని సందర్శనీయ ప్రాంతాలను మూసివేయనున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను నవంబరు 18 (శుక్రవారం) నుంచి మూసివేయనున్నారు. 20వ తేదీ వరకు సందర్శకులను అనుమతించరు. 21న వాటిని మళ్లీ తెరుస్తారు.
రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్ కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా - ఈ రేసింగ్‌లను నిర్వహిస్తుంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరంపైన రోడ్డులో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. దీంతో కొద్ది నెలల ముందు నుంచే ఎన్టీఆర్ మార్గ్ లో పాత రోడ్డును రేసింగ్ ట్రాక్ కు అనుకూలంగా మార్చుతున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపుగా గ్యాలరీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆ వైపుగా ట్రాఫిక్ ఆంక్షలను నవంబరు 16 రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad Traffic) ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఖైరతాబాద్ కూడలి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ గుడి రూట్, ట్యాంక్‌బండ్ పరిసరాలలో వెళ్లొద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు. అనసవసరంగా ఆ రూట్‌లలో వెళ్లి ట్రాఫిక్ వలచంలె చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.
పూర్తిగా మూసివేసే మార్గాలు
ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన వివరాల మేరకు ఖైరతాబాద్ కూడలి నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వరకూ పూర్తి మార్గాన్ని మూసివేయనున్నారు.
నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ మార్గాన్ని కూడా పూర్తిగా మూసివేయనున్నారు. ప్రసాద్ ఐ మాక్స్ సమీపంలోని కూడలి నుంచి పీవీ నరసింహారావు మార్గ్ ను నల్లగుట్ట జంక్షన్ వరకూ పాక్షికంగా మూసివేయనున్నారు. ఈ మార్గంలోకి జనరల్ ట్రాఫిక్ ను అనుమతించరు.