తన భద్రతకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంటెలిజెన్స్ ఐజీకి లెటర్‌ రాసిన రాజాసింగ్.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తన బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం మార్చాలని రిక్వస్ట్ చేశారు. 


ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. తరచూ తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం బ్రేక్‌డౌన్ అవుతుందని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనడానికి డబ్బుల్లేవా లేకుంటే కేసీఆర్ అనుమతి లేదా అని ఆరా తీశారు. ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా.. లేకుంటే అధికారులే సైలెంట్‌గా ఉంటున్నారా అని అడిగారు. 


వాహనంపై ఆగ్రహం 


జైలు నుంచి విడుదలైన తర్వాత రోజు కూడా బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంపై అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంటే తనకు ఇలాంటి వాహనం ఇస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ముప్పు పొంచి ఉందన్న క్రమంలో కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచుగా రిపేర్ చేయించాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై రాజా సింగ్ మాట్లాడుతూ.. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిందని, దాంతో అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు చెప్పారు.


మొదట నాలుగు నెలల కిందట బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డు మధ్యలోనే ఆగిపోతే రిపేర్ చేయించడానికి ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి పంపించాను. రిపేర్ చేసి మళ్లీ తనకు ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పు లేదన్నారు.  నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ రెండు నెలల క్రితం మళ్లీ ఆగిపోయిందని తెలిపారు. దాంతో చేసేదేమీ లేక గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. ఓసారి అఫ్జల్‌గంజ్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. 


దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. ఇకపైన అయినా అధికారులు, ప్రభుత్వం స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదల..
ఎమ్మెల్యే రాజా సింగ్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన గత బుధవారం రోజున చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎలాంటి రెట్టగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించ వద్దని కూడా షరతు విధించింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.


బుధవారం సాయంత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయగానే రాజాసింగ్ భార్య ఉషాభాయి న్యాయవాదులతో కలిసి జైలుకు వెళ్లారు. అప్పటికే బెయిల్ ఆర్డర్ ఆన్ లైన్ ద్వారా జైలు అధికారులకు చేరడంతో నిమిషాల వ్యవధిలోనే రాజాసింగ్ ను విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ ప్రజలకు అభివాదం చేస్తూ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజసింగ్ అనుచరులు, అభిమానులు ర్యాలీ తీసేందుకు విఫల యత్నం చేశారు. బాణాసంచా పేల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు అర కిలోమీటర్ వరకు ఎవరూ గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.