Telangana On Polavaram: పోలవరం ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలో అంటే 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణ రాష్ట్రంపై ఏమేరకు ప్రభావం పడుతుంది, ఎన్ని గ్రామాలు, ఎంత భూభాగం మునిగిపోతుందో పక్కాగా తెలుసుకునేందుకు ఉమ్మడి సర్వే చేయాల్సిందేనని తెలంగాణ మరోసారి గట్టిగా తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే తెలంగాణలోని భద్రాచలం నుండి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరు పక్కలా రాష్ట్ర పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురి అవుతాయని తమ ఇంజినీర్లు తేల్చారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఐ భేటీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


'892 ఎకరాల్లో సర్వే చేయాల్సిందే'


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. ముర్రెడు వాగు, కిన్నెరసానిలకు మాత్రమే పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో సర్వే జరిపించాలని ఈ మేరకు డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ - పీపీఏ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోలవరం ముంపు ప్రభావంపై వాడి వేడిగా చర్చించారు. ఏపీ నుండి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్, ఈఎన్సీ సి. నారాయణ రెడ్డి పాల్గొనగా.. తెలంగాణ నుండి నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్ కుమార్ భేటీకి హాజరయ్యారు. 


'పంపింగ్ బాధ్యతా ఏపీదే'


పోలవరం అథారిటీ భేటీలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ మాట్లాడుతూ.. పోలవరంతో తెలంగాణలో 300 ఎకరాలు మునిగిపోయే అవకాశం ఉందని, ముంపు ప్రభావంపై మరింత అధ్యయనం జరిపి నివారణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పోలవరం ప్రాజెక్టు అథారిటీ- పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే కోసం వచ్చిన ఏపీ అధికారులు.. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రెడువాగులపై పడనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరగా.. ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకుని మళ్లీ వస్తామంటూ తిరిగి వెళ్లి పోయారని మురళీధర్ గుర్తు చేశారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్ వాటర్ అడ్డంకిగా మారిందని.. దాని వల్ల ఆయా పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయని, తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలిపారు. గత సంవత్సరం జులైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40 వేల 446 ఎకరాలు వరదల్లో మునిగిపోయాయని వెల్లడించారు. అలాగే పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9 వేల 389 ఎకరాలు మునిగిపోతాయని వివరించారు. వరదలు, ముంపు ప్రభావంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘంతో అధ్యయనం చేయించాలని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ సి. మురళీధర్ కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భేటీలో ఆయన డిమాండ్ చేశారు. 


'ఏకాభిప్రాయం రాలేదు'


తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, అలాగే ఏపీ కూడా అంగీకారం తెలపలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రానందున కేంద్రం ఆధ్వర్యంలో మరోసారి భేటీ నిర్వహిస్తామని కేంద్ర సర్కారు చెప్పినట్లు గుర్తు చేశారు.