Kuno National Park: 


కునో నేషనల్‌ పార్క్‌లోనే..


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవలే నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ఇటీవలే ట్వీట్ చేశారు. అయితే...చిరుతల సంరక్షణలో భాగంగా భారత్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ సారి 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి రప్పించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కునో నేషనల్ పార్క్అధికారులు చెప్పిన వివరాల ప్రకారం...12 చీతాలను సౌతాఫ్రికా నుంచి తెచ్చే విషయమై భారత ప్రభుత్వానికి, ఆ దేశానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నాటికి ఈ చీతాలు కునో నేషనల్ పార్క్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఇటీవలే ఈ పార్క్‌ను సందర్శించారు. చీతాల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆరా తీశారు. చీతాలన్నీ ఆరోగ్యంగా ఉండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ అధికారులను ప్రశంసించారు. సౌతాఫ్రికా నుంచి వచ్చే 12 చీతాలకు ఇప్పటికే 14 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో 6 ఎన్‌క్లోజర్ల నిర్మాణం పూర్తైనట్టు సమాచారం. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే చీతాలను కొద్ది రోజుల పాటు ఈ ఎన్‌క్లోజర్లలో ఉంచనున్నారు. దీంతో పాటు...ప్రస్తుతం ఎన్‌క్లోజర్‌లలో ఉంటున్న 8 చీతాలను అడవిలోకి వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సౌతాఫ్రికా నుంచి కూడా చీతాలు వస్తే..భారత్‌లో వీటి సంఖ్య 20కి చేరుతుంది. 


సంరక్షణా చర్యలు..


నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. వీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలే చేపడుతోంది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని...ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకోనుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేయనున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయటమే కాదు. చీతాల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోంది కేంద్రం. వేటగాళ్ల నుంచి వీటికి రక్షణ కల్పించేందుకు... ప్రత్యేక శిక్షణ తీసుకున్న జర్మన్ షెపర్డ్స్‌ కుక్కల్ని కాపలాగా ఉంచనున్నారు. ప్రస్తుతం వీటికి ఇండో టిబెటన్ బార్డర్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కునో నేషనల్ పార్క్‌లో...చీతాలున్న చోట ఇవి కాపలా కాస్తాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని 
అధికారికంగా వదిలారు. వాటిని సంరక్షించి అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మొదటి విజయం. రీఇంట్రడక్షన్ ఆఫ్ యానిమల్స్ (Reintroduction of Animals)లో భాగంగా భారత్‌ ఇలా చీతాలను నమీబియా నుంచి తెప్పించింది. 


Also Read: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం, బాధితురాలి పిటిషన్‌లు కొట్టివేత