Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించిన రివ్యూ పిటిషన్‌పై విచారణను మథుర సివిల్ కోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది. ఈ మేరకు ANI వార్తా సంస్థ పేర్కొంది. అంతకుముందు ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగాల్సి ఉండగా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.


ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.   


ఇదీ వివాదం


ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి హిందువులకు ప్రముఖ పుణ్య క్షేత్రం. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంగా పేర్కొనే మథురతో పాటు ఆ చుట్టు పక్కల బృందావనం, గోకులం వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతాలుగా పురాణ గ్రంథాల్లో ఉంది. 


వివాదమేంటి?


మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావించే 13.37 ఎకరాల భూ యూజమాన్య హక్కులపై అసలు వివాదం మొదలైంది. ఈ స్థలం శ్రీకృష్ణుడిదని కనుక శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగించాలని పిటిషన్‌దారులు కోరుతున్నారు. ఇక్కడ నిర్మించిన మసీదు 17వ శతాబ్దంలో నిర్మించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1669-70 కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణుని జన్మస్థలంలో మసీదును నిర్మించారని చెబుతున్నారు.


అయితే శ్రీకృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా మసీదు వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేయాలని మథుర కోర్టుకు అల్‌హాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్ ఆదేశాలిచ్చింది.


1968 ఒప్పందం


ఈ స్థల వివాదాన్ని పక్కనపెడితే 1968లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వహణ అథారిటీ, షాహీ ఈద్గా మసీదు ట్రస్ట్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈ స్థలాన్ని ఈద్గాకు ఇచ్చేందుకు ఆలయ అథారిటీ ఒప్పుకుంది.


వివాదానికి సంబంధించి 1968లో మథుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని, శ్రీకృష్ణ జన్మస్ధాన్‌ సేవా సంఘ్‌, షాహి ఈద్గా ట్రస్ట్‌ మధ్య నాడు కుదిరిన రాజీ ఒప్పందం సరికాదని గుర్తించాలంటూ తాజా పిటిషన్‌లో కోరారు. కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే ఈ ఒప్పందానికి చట్టపరంగా ఎలాంటి చెల్లుబాటు లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు.


పిటిషనర్లు ఎవరు?


మథుర సివిల్ కోర్టులో ఈ వివాదంపై 2020 సెప్టెంబర్‌లో తొలి పిటిషన్ దాఖలైంది. లఖ్‌నవూ వాసి రంజనా అగ్నిహోత్రి సహా మరో ఆరుగురు వ్యక్తులు శ్రీకృష్ణు భగవానుడి తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ మసీదును తొలగించి ఆ ప్రాంతాన్ని కృష్ణ జన్మభూమి ట్రస్టుకు తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.


అయితే 2020 సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సివిల్ కోర్టు జడ్జి తిరస్కరించారు. పిటిషనర్లు ఏ ఒక్కరూ మథురకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్లు తమ వ్యాజ్యాన్ని పునఃపరిశీలించాలని మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2022 మే 19న ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ట్రస్ట్‌ను, ఆలయ అథారిటీలను ఈ దావాలో పార్టీలుగా చేర్చింది.


2020 నుంచి ఇప్పటి వరకు మథుర కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కనీసం డజనుకుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకరు ఈ స్థలంలో తవ్వకాలు జరపాలని కోరగా, మరొకరు పురావస్తు శాఖతో సర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. మసీదులో ఉండే ఆలయ అవశేషాల రక్షణ కోసం అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మరొక పిటిషనర్‌ కోరారు.


చరిత్ర ఏం చెబుతోంది?


శ్రీకృష్ణ జన్మస్థానంగా చెబుతోన్న కత్రా కేశవ్‌ దేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్లు కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచినట్లు చెబుతారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దం (బీసీ)లో వజ్రానభుడు నిర్మించినట్లు సమాచారం. ఆయన స్వయానా శ్రీకృష్ణునికి మునిమనవడు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని కాలక్రమేణ అనేకసార్లు పునర్నిర్మించారు.


ఇక్కడ ప్రస్తుతం ఉన్న షాహీ ఈద్గా మసీదును 1670లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించిన వేలంపాటలో 13.77 ఎకరాల భూమిని బెనారస్ (వారణాసి) రాజు రాజా పత్ని మాల్ కొనుగోలు చేశారు.


19 శతాబ్దం వరకు బెనారస్ రాజు పేరుపైనే ఈ స్థలం ఉండేది. అయితే 1935లో అల్‌హాబాద్ హైకోర్టు ఈ యాజమాన్య హక్కులను కొట్టేసింది. 10 ఏళ్ల తర్వాత యుగల్ కిశోర్ బిర్లా అనే వ్యాపారి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1958లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆలయ ట్రస్ట్ బాధ్యతలు ఈ సంఘం చూసుకుంటుంది.


Also Read: Sardar of Thieves: నా శాఖలో అందరూ దొంగలే, వారందరికీ నేనే సర్దార్: బిహార్ మంత్రి


Also Read: Mukul Rohatgi: అటార్నీ జనరల్‌గా మరోసారి ముకుల్ రోహత్గి!