BR AMbedkar Konaseema: పులస చేపలంటే చాలు భలే గిరాకీ ఉంటుంది. పుస్తెలు అమ్మయినా సరే పులస తినాలి అని వింటుంటాం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదల సమయంలో అప్పుడప్పుడు దొరికే పులస గిరాకీనే వేరు. వేటాడే సమయంలో వలకు చిక్కిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో పులస చనిపోతుంది. అయితే ఓ మత్స్యకారుడికి దొరికిన పులస మాత్రం చాలాసేపటి వరకు ప్రాణాలతో ఉంది. దాంతో పులసను పట్టుకున్న మత్స్యకారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తాను ఊహించినట్లే మార్కెట్లోకి తెచ్చిన వెంటనే బతికున్న పులసను చూసి ఏకంగా 17 వేల రూపాయలు ( Pulasa Fish Price ) పెట్టి కొన్నాడు ఒక పులస ప్రియుడు.
వరదలతో తగ్గిన పులస జాడ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారిలంక గోదావరిలో లైవ్ పులస దొరికింది. మాములుగా పులస వలలో పడగానే పదినిమిషాల్లో చనిపోతుంది. కాని జాలరి చందాడి సత్యనారాయణ వలలో పడ్డ పులస లైవ్ గా దొరికింది. దీంతో తన పంట పండిందనుకున్నాడు ఆ మత్స్యకారుడు. లైవ్ లో దొరికిన సుమారు కేజీ వున్న గోదావరి పులసను మామిడికుదురు మండలం పెదపట్నంలంక కు చెందిన నల్లి రాంప్రసాద్ అనే పులస ప్రియుడు ఏకంగా 17000 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు.
ఇదిలా వుంటే సుమారు పది ముక్కలు తెగిన ఈ పులస ఖరీదు అర గ్రాము బంగారంతో సమానమయ్యిందని కొందరు లెక్కలు కడుతున్నారు. లెక్క ఎలా వున్నా కాని ముక్క మాత్రం సూపర్ అంటున్నారు లైవ్ పులసను కొన్న రాంప్రసాద్. అందుకేనేమో పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అన్నారు పెద్దలు. గోదావరి పులసా మజాకా.. ఇదిలా ఉంటే లైవ్ పులస దొరకడం చాలా అరుదు అని మత్స్యకారులు చెబుతున్నారు.
రూ. 23 వేలు పలికిన పులస
గోదావరి జిల్లాల్లో పులస చేపకు మామూలు క్రేజ్ ఉండదు. వర్షాకాలం వచ్చిందంటే జాలర్లు, భోజన ప్రియులు పులస కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. పులస చేపల పులుసు ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి ఈ చేపలకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే పులస దొరకగానే వాటిని సొంతం చేసుకునేందుకు భోజన ప్రియులు బారులు తీరుతారు. యానాం మార్కెట్లో ఇటీవల రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది. తాజాగా మరో పులస జాలర్లకు చిక్కింది. దీని ధర మరింత ఎక్కు పలికింది. రెండు కిలోల బరువున్న పులస చేప ఆగస్టు 28 న యానాం రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద అమ్మకానికి పెట్టారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. అనంతరం దానిని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేప గోదావరిలో వరద నీటికి ఎదురీదుతుంది.
సముద్రంలో ఉప్పు నీటిని తాగే ఈ పులస చేప, గోదావరి నదిలోకి ప్రవేశించగానే మంచి నీటిని తీసుకుంటుంది. అందుకే వీటి రుచి సైతం ప్రత్యేకంగా ఉంటుందని తినేవారు చెబుతారు. ఇటీవల యానాం మార్కెట్లోనూ రూ.22 వేలకు పులస చేపను ఖరీదు చేశారు. రెండు రోజుల కిందట సైతం దాదాపు ఇరవై వేలకు పులస కొనుగోలు చేశారు పులస ప్రియులు.