Kharge Calls Meet: 


టార్గెట్ 2024..


కర్ణాటకలో గెలిచిన తరవాత కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే జోష్‌తో రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలనూ ఎదుర్కోవాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ముఖ్యంగా...ఈ బాధ్యతల్ని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీసుకున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో తరచూ భేటీ అవుతున్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఎలక్షన్ స్ట్రాటెజీస్‌పై ఇప్పటికే ఖర్గే ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. అయితే...ఆ వ్యూహాలను పార్టీలోని కీలక నేతలతో చర్చించాలని భావిస్తున్నారు. అందుకే ఈ నెల 24వ తేదీన (బుధవారం) అందరితో సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈ భేటీలో చర్చించనున్నారు. నిజానికి...కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య టగ్‌ ఆఫ్ వార్ కనిపించనుంది. కర్ణాటకలో బీజేపీని ఓడించిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్..మిగతా రాష్ట్రాల్లోనూ అవే ఫలితాలు రాబట్టుకోవాలని భావిస్తోంది. కార్యకర్తల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకూ ఖర్గే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అసంతృప్తి నేతల్నీ బుజ్జగిస్తున్నారు. రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ క్యాడర్‌ కాస్త బలహీనంగానే ఉంది.


అదే అస్త్రం ప్రయోగిస్తారా..? 


అయితే.."ప్రభుత్వ వ్యతిరేకత" అనే అస్త్రం కర్ణాటకలో బాగా పని చేసింది. పదేపదే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కలిసొచ్చింది. అందుకే...అదే వ్యూహాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని చూస్తోంది హైకమాండ్. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసినా...జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం వల్ల కుప్ప కూలింది. ఈ సారి ఇక్కడ కూడా కమ్‌బ్యాక్ ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంది కాంగ్రెస్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కీలక నేతల్ని సమావేశానికి పిలిచారు. ఆయా రాష్ట్రాల నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే యాక్టివ్‌గా ఉండాలనే ఆదేశాలివ్వనున్నారు. అదే సమయంలో భారత్ జోడో యాత్ర తమకు బాగానే కలిసొస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉంది కాంగ్రెస్. కర్ణాటకలో విజయంలో...ఈ యాత్రకీ క్రెడిట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లలో జోడో యాత్ర చేపట్టారు రాహుల్. ఆ ప్రభావం కొంతైనా ఉంటుందన్న ధీమాగా ఉన్నారు రాహుల్. అయితే...రాజస్థాన్‌లో అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. సచిన్ పైలట్, గహ్లోట్ మధ్య విభేదాలు సద్దుమణిగేందుకూ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే..ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి, మంత్రి టీఎస్ సింగ్ డియోకి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. సీఎం పదవిని ఆసించిన సింగ్ డియో..కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇక తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి వర్గానికి, ఇతర కాంగ్రెస్ నేతలకు సఖ్యత కుదరడం లేదు. ఈ సవాళ్లన్నీ దాటుకుని ఎలా విజయం సాధించాలో ఉపదేశం చేయనున్నారు ఖర్గే. ఈ మీటింగ్ తరవాత కచ్చితంగా కాంగ్రెస్‌ క్యాడర్‌ బలపడుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: 2000k note: గోల్డ్ షాపులు కిటకిట - ₹2000 నోట్లు తీసుకోవడానికి 'వన్‌ కండిషన్‌'