RBI 2000 Rupees Note: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న తర్వాత, దేశవ్యాప్తంగా అనూహ్యంగా నగదు రూప కొనుగోళ్లు పెరిగాయి. నిన్నమొన్నటి వరకు UPI లావాదేవీలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డ్‌ వాడిన వాళ్లు కూడా ఇప్పుడు పింక్‌ నోట్లతో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇళ్లలో, లాకర్లలో దాచిన రూ. 2000 నోట్లను బయటకు తీసి, అవసరం ఉన్నా, లేకపోయినా ఏదోక వస్తువు కొంటున్నారు. తద్వారా పెద్ద నోట్లను మారుస్తున్నారు. 2000k నోటు ఉపసంహణ నిర్ణయం తర్వాత బంగారం & వజ్రాభరణాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.


నగల దుకాణాల్లో పెరిగిన రద్దీ
ప్రస్తుతం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉంది. అయినా, 2000k నోట్లను వదిలించుకోవడానికి జనం నోట్ల కట్టలు పట్టుకుని నగలు & వజ్రాభరణాల షాపులకు పరుగులు తీస్తున్నారు. పెరిగిన బంగారం & వజ్రాభరణాల అమ్మకాలు, కస్టమర్ల రద్దీతో వ్యాపారులు ఖుషీగా ఉన్నారు. అయితే, 2016 డీమోనిటైజేషన్‌ తర్వాతి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 2016లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు కూడా బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను అప్పుడు వ్యాపారులు తీసుకున్నారు. ఆ తర్వాత, పెద్ద స్థాయిలో నగదు ఆధారిత అమ్మకాలు జరిపినందుకు ఆదాయ పన్ను విభాగం నుంచి విచారణలు ఎదుర్కొన్నారు. ఆ సీన్‌ ఇప్పుడు రిపీట్‌ కాకుండా, బంగారం షాపుల యజమానులు కస్టమర్లకు కొన్ని షరతులు పెడుతున్నారు. 


కస్టమర్ల KYC తప్పనిసరి
సెన్కో గోల్డ్ అండ్ డైమండ్‌ చైన్‌కు మొత్తం 139 స్టోర్లు ఉన్నాయి. మింట్ రిపోర్ట్‌ ప్రకారం, కస్టమర్ల నుంచి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్న ఈ కంపెనీ, కస్టమర్ల పాన్, ఆధార్ కార్డ్ కాపీలను రుజువులుగా అడుగుతోంది. పుణె కేంద్రంగా పని చేస్తున్న పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్‌కు కూడా మూడు రాష్ట్రాల్లో 29 స్టోర్లు ఉన్నాయి. వాళ్లు కూడా కస్టమర్ల పాన్, ఆధార్ కార్డ్ కాపీలను తీసుకుని రెండు వేల నోట్లను స్వీకరిస్తున్నారు. రూ. 20 వేల నుంచి 50 వేల వరకు నగదు రూపంలో చేసే చెల్లింపులకు ముంబై నగల వ్యాపారులు కూడా కస్టమర్ల పాన్ & ఆధార్ కార్డులను అడుగుతున్నార.


రూల్స్‌ ఏం చెబుతున్నాయి?
PMLA నిబంధనల ప్రకారం, బంగారం కొన్నప్పుడు, రూ. 50,000 వరకు నగదు రూప చెల్లింపులకు KYC అవసరం లేదు. రూ. 50,000-2 లక్షల మధ్య విలువైన బంగారం కొని నగదు రూపంలో చెల్లించాలంటే వ్యక్తిగత గుర్తింపు రుజువుగా చూపడం అవసరం. రూ. 2 లక్షలు దాటిన నగదు రూప కొనుగోళ్లకు పాన్ కార్డ్ కాపీని సమర్పించడం తప్పనిసరి.


ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా రూ. 2000 నోట్లను మార్చుకోవాలని ఆర్‌బీఐ శుక్రవారం (19 మే 2023) ప్రకటించింది. ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్‌ శాఖ లేదా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి గుర్తింపు కార్డ్‌ చూపాల్సిన అవసరం లేదు, ఫారాలు నింపాల్సిన పని లేదు. ఒక లావాదేవీలో గరిష్టంగా రూ. 20,000 వరకు (రూ.2000 నోట్లు 10) మార్చుకోవచ్చు. ఖాతాలో డిపాజిట్‌ చేయడానికి మాత్రం ఎటువంటి పరిమితిని RBI విధించలేదు. నగదు జమ విషయంలో ఆ ఖాతాకు ప్రస్తుతం ఎలాంటి నియమాలు వర్తిస్తున్నాయో, రూ.2000 నోట్ల డిపాజిట్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి.


ఇది కూడా చదవండి: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Vedanta, Delhivery, Power Grid