యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వచ్చిన తారక్ పుట్టినరోజు కావడంతో, అభిమానులు గతంలో లేనంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కేకులు కట్ చేసి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. రక్తదానాలు, అన్నదానాలు వంటి సామాజిక కార్యకలాపాలు కూడా నిర్వహించారు. వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి 'సింహాద్రి' చిత్రాన్ని గ్రాండ్ గా రీరిలీజ్ చేసారు. అయితే ఈ సందర్భంగా కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ థియేటర్ లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
ఎన్టీఆర్ 40వ బర్త్ డే స్పెషల్ గా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సింహాద్రి' సినిమా మళ్ళీ విడుదల అవడంతో, అభిమానులు ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సినిమా రిలీజైన థియేటర్ల దగ్గర తారక్ కటౌట్ లకు పాలాభిషేకాలు, కేకులు చేసి సందడి చేశారు. అయితే విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్ లో ఫ్యాన్స్ ఏకంగా టపాసులు పేల్చారనే ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
హాల్ లో క్రాకర్స్ కాల్చడంతో, సీట్లకు మంటలు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయని వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారట. దీంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని, కొంత మేరకు ఆస్తి నష్టం మాత్రం జరిగిందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు క్యాన్సిల్ చేశారు. దీంతో 'సింహాద్రి' సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఫ్యాన్స్ అత్యుత్సాహంతో గతంలోనూ ఇలాంటి ఘనటనలు అనేకం చోటుచేసుకున్నాయి. థియేటర్ లో టపాసులు పేల్చడం వల్ల కొన్నిసార్లు స్క్ర్రీన్స్ కాలిపోతే, మరికొన్ని సార్లు సీట్లు కాలిపోయాయి. అభిమానులే థియేటర్లను ధ్వంసం చేసిన సందర్భాలు ఇంకొన్ని ఉన్నాయి. ఏదేమైనా రీరిలీజులను ఎంజాయ్ చేయడం వరకూ ఓకే కానీ, అభిమానం పేరుతో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునేలా వ్యవహరించడం సరైంది కాదు. ఏదైనా జరగరానిది జరిగితే అది చివరకు హీరోలకు చెడ్డ పేరు తీసుకొస్తుందనే విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'సింహాద్రి' రీ-రిలీజ్ ఆల్ టైం రికార్డ్...
2003లో ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'సింహాద్రి'. 20 ఏళ్ళ తర్వాత తారక్ బర్త్ డే సందర్భంగా శనివారం (మే 20) ఈ మూవీని 4K వెర్షన్ తో రీ-రిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదల చేశారు. 150కి పైగా థియేటర్స్ లో, మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ మెల్బోర్న్ ఐమాక్స్ లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రం రీరిలీజ్ లో రూ.5.2 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్లుగా కొన్ని వెరిఫైడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పేర్కొనబడింది.
Read Also: నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు, ఎన్నో ఆటు పోట్లు - ఎన్టీఆర్ సినీ జర్నీ సాగిందిలా!