కృష్ణాజిల్లాలోని బందరు పోర్టుకు ఇవాళ మరోసారి శంకుస్థాపన జరగనుంది. 5.156 కోట్ల రూపాయలతో చేపడుతున్న బందరు పోర్టు నిర్మాణ పనులకు జగన్ భూమి పూజ చేయనున్నారు. ఈ పోర్టుకు ఇప్పటికే భూసేకరణ పూర్తైంది. అన్ని అనుమతులు వచ్చాయి. కోర్టుల్లో ఉన్న వివాదాలు కూడా పరిష్కారమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో శరవేగంగా పోర్టు పనులు పూర్తి చేయబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఉదయం 8.30కు తాడేపల్లి నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి మచిలీపట్నం చేరుకుంటారు. అక్కడ తపసిపూడి గ్రామానికి చేరుకొని బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేస్తారు. పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 


నాలుగు పోర్టులు- 16వేల కోట్లు


రామాయపట్నం, కాకినాడ గేట్‌వే పోర్టు, మూలపేట పోర్టు పనులు కొనసాగుతున్నాయని ఇప్పుడు మచిలీపట్నం పోర్టు పనులు కూడా ఊపందుకోనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. పదహారు వేల కోట్ల వ్యయంతో ఈ నాలుగు పోర్టుల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ఇవి పూర్తైతే సుమారు 70 వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 


నాలుగు బెర్తులతో...


35.12 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోలతో దీన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒకటి బొగ్గుకు, రెండోది మల్టీపర్పస్‌ కంటైనర్లు. మొత్తంగా నాలుగు బెరర్తులతో మచిలీపట్నం పోర్టును నిర్మించనున్నారు. దీని నిర్మానం రెండున్నర ఏళ్లలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పోర్టు కారణంగా 25వేల మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం చెబుతోంది. 


తెలంగాణకు ప్రయోజనకరం


మచిలీపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా తెలంగాణకు కూడా ఉపయోగపడనుంది. ఎరువులు, బొగ్గు, వంటనూనె, సిమెంటర్‌, గ్రానైట్‌, ముడి ఇనుము దిగుమతికి తెలంగాణలో ఎంతగానో ఉపయోగపడనుంది. 2020 ఫిబ్రవరి 4నే నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. మచిలీపపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి ఈ ఫిబ్రవరి 28న పర్యావరణ అనుమతి లభించింది. ఈ ఏడాది మార్చికి 1923 ఎకరాల భూమి సేకరణ పూర్తైంది. 


పోర్టు సమగ్ర స్వరూపం


బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని గతంలోనే అంచనాకు వచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం  ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది. దీంతో క్యాబినేట్ సమావేశంలో రుణం తీసుకునే అంశం పై చర్చించారు. రుణం పొందేందుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్   ఇచ్చింది. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి  2 కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు రూ.446 కోట్లు అవసరం అవుతాయని ఇప్పటికే అంచనాలు కూడ రూపొందించారు. ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున  సడన్ బ్రేక్ వాటర్ రూ. 435  కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది.  డ్రెడ్జింగ్ కోసం మరో రూ.1242.88  కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి  రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి  టర్నింగ్ సర్కిల్, బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ రెడీ చేశారు. 


మూడోసారి శంకుస్థాపన


బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. మొన్నీ మధ్య భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా ఇదే జరిగింది. రెండోసారి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఎన్నికల కోసమే చంద్రబాబు ఈ శంకుస్థాపనలు చేశారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్పుడు భోగాపురం, ఇప్పుడు బందరు పోర్టు విషయంలో అదే జరిగిందని అంటున్నారు. 


పోర్ట్ నిర్మాణం జరిగితే దశాబ్దాలుగా కలలు కంటున్న స్దానికుల కల తీరుతుంది. కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి, నిర్మాణ పనులకు శంఖుస్దాపన కాకుండా, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బాలశౌరి చెబుతున్నారు.  బందరు పోర్ట్ నిర్మాణం విషయంలో స్దానిక శాసన సభ్యుడు పేర్నినాని, పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి మధ్య విభేదాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయి.  ఈ కారణంతోనే బందరు పోర్ట్ పనుల ను నేరుగా ప్రారంభించేందుకు రావాల్సిన ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడ వాయిదా పడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే శాసన సభ్యుడు పేర్ని నాని పోర్ట్ పనులను ప్రారంభించేందుకు అవసరం అయిన మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. 


Also Read: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం - టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే పరస్పర ప్రశంసల పర్వం!


Also Read: ఆయనది మానవ జన్మా, రాక్షస జన్మా? ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు