PM Modi Kerala Visit:


కేరళలో రెండ్రోజుల పర్యటన 


ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేరళలో పర్యటించనున్నారు. తిరువనంతపురంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్లనున్నారు. అయితే...కేరళ పర్యటనకు ముందు బీజేపీ ఏర్పాట్లు చేస్తుండగా ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. రెండ్రోజుల పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ప్రాణానికి హాని ఉందంటూ ఓ లెటర్ వెలుగులోకి వచ్చింది. కేరళ బీజేపీ చీఫ్ కె సురేంద్రన్‌ను ఈ లేఖ రావడం సంచలనం కలిగించింది. ఎర్నాకులం ప్రాంతానికి చెందిన జోసఫ్ జెన్నీ అనే వ్యక్తి ఈ లెటర్ పంపినట్టు వెల్లడించారు సురేంద్రన్. ఈ దెబ్బతో ఒక్కసారిగా అంతా అలెర్ట్ అయ్యారు. ఏప్రిల్ 17న కేరళలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి ఈ లేఖ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సురేంద్రన్...పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెటర్‌ను అందజేశారు. 


"ప్రధాని మోదీకి ప్రాణహాని ఉందంటూ ఓ  బెదిరింపు లేఖ వచ్చింది. వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించాం. ఇంటిలిజెన్స్ విభాగం కూడా సంచలన విషయాలు చెప్పింది. కొందరు ఉగ్రవాదులు కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసినట్టు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ వచ్చే సమయానికే ఈ లెటర్ రావడం, నిఘా వర్గాలు కూడా అలా హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది"


- కె సురేంద్రన్, కేరళ బీజేపీ చీఫ్ 






ఇదీ షెడ్యూల్..


ప్రస్తుతానికి ఈ లెటర్‌ని పంపిన వ్యక్తిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు కేరళ పోలీసులు. అయితే ఆ తరవాత తేలిందేంటంటే ఆ వ్యక్తి తాను ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ మిస్టరీ ఇంకా వీడలేదు. ఎవరు ఈ లేఖ పంపారు..? అదే పేరుతో ఎందుకు పంపించారు..? అన్నది తేలాల్సి ఉంది. ఇక మోదీ పర్యటన విషయానికొస్తే...ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని కొచ్చికి చేరుకుంటారు. అక్కడే రోడ్‌షో నిర్వహిస్తారు. యూత్ మీటింగ్‌కు హాజరవనున్నారు. ఆ తరవాత రాష్ట్రంలోని 9 కీలక చర్చ్‌ల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మరుసటి రోజు అంటే..ఏప్రిల్ 25న తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సెంట్రల్ స్టేడియం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్తారు. ఇటీవలే మూడు వందే భారత్ ట్రైన్‌లను ప్రారంభించారు ప్రధాని. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్యలో ఓ ట్రైన్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ తరవాత తమిళనాడులోనూ ఓ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోనూ ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందేభారత్‌ను ప్రారంభించారు. 


Also Read: మన్‌ కీ బాత్‌ 100 వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రధాని స్పెషల్ గిఫ్ట్, రూ.100 కాయిన్ విడుదల