దేశంలోనే అతి చిన్న వయసులోనే ఓ నగర మేయర్ పదవి చేపట్టి యువతలో స్ఫూర్తి నింపిన ఆర్య రాజేంద్రన్ వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్​ను ఆమె వివాహం చేసుకోనున్నారు. సచిన్ దేవ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.


స్నేహితులే


ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం తిరువనంతపురం మేయర్​గా పనిచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సచిన్ దేవ్‌, ఆర్య ఇద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వారి వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నెల రోజుల్లోనే వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


సచిన్


బలుస్సెరీ అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రెటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్​కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం సీపీఎం ఇచ్చింది.


2021 ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి సచిన్ గెలుపొందారు. కోజికోడ్​కు చెందిన సచిన్ ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు.


ఆర్య


20 ఏళ్ల వయసులోనే ఆర్య రాజేంద్రన్‌.. తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికయ్యారు. దేశంలోనే అతి చిన్న వయసులోనే ఓ నగర మేయర్ పదవి చేపట్టి రికార్డ్ సృష్టించారు.


ఆర్య తండ్రి రాజేంద్రన్‌ ఎలక్ట్రీషియన్‌. తల్లి శ్రీలత ఎల్​ఐసీ ఏజెంట్‌. ఆరేళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే బాలసంఘంలో ఆర్య చేరారు. ఆసియాలోనే అత్యధికమంది బాలలు సభ్యులుగా ఉన్న సంస్థ ఇది. బాల సంఘం ఇచ్చిన శిక్షణ ఆర్యలో స్వతంత్ర భావాలను ఇనుమడించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే కళాశాలలో విద్యార్థి నాయకురాలుగా ఎదిగారు.


మరోవైపు బాలసంఘం తరఫున కూడా చురుగ్గా సేవలందిస్తుండటంతో సీపీఎమ్.. ఈమెను బాలసంఘానికి కేరళ అధ్యక్షురాలిగా నియమించింది.


గతేడాది జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముదవన్‌ ముక్కల్‌ వార్డుకు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఆమె గెలిచారు. రెండువేలకు పైగా ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయాన్ని సాధించిన ఆర్యను వెతుక్కుంటూ.. ఏకంగా తిరువనంతపురం మేయర్ పీఠం కదిలి వచ్చింది.


Also Read: New Road Safety Rules: బండిపై పిల్లల్ని తీసుకెళ్తున్నారా? అయితే ఇక ఈ రూల్స్ పక్కా


Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ భక్తి పారవశ్యం!