చంటి బిడ్డలను బండిపై తీసుకుళ్తున్నారా? అయితే ఇక లైట్ తీసుకోవద్దు. ఆ ఏముందిలే మనం హెల్మెట్ పెట్టుకుంటే చాలు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కేంద్ర రోడ్డు, రవాణా శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వారికి సరిపడే హెల్మెట్‌ను ధరించాలి.
ఇవి తప్పనిసరి
ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారి భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని మంత్రిత్వశాఖ పేర్కొంది.
ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లల్ని తీసుకువెళ్లాలంటే వాటికి సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. అది కూడా చాలా తక్కువ బరువుతో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. 30 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉండాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే చలానా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలానే పిల్లలను తీసుకువెళ్లే బైక్ 40 కిమీ కంటే వేగంతో వెళ్లకూడదు.
హెల్మెట్ ఇలా
పిల్లల హెల్మెట్ల విషయానికి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటివరకు సైకిల్ హెల్మెట్లను వినియోగించాలని సర్కార్ తెలిపింది.