Aravana Payasam Sabarimala:


యాలకుల్లో పురుగు మందుల అవశేషాలు..


కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప ఆలయ ప్రసాదం "అరవణ పాయసం" పంపిణీని వెంటనే ఆపేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ (TDB)ని ఆదేశించింది. ఈ ప్రసాదంలో వాడిన యాలకుల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్‌టీ అధికారులు గుర్తించారు. దీనిపై ఓ నివేదిక కూడా అందించారు. ప్రసాదంలో వినియోగించిన యాలకుల్లో 14 రకాల హానికర అవశేషాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికిప్పుడు ప్రసాదం తయారీని నిలిపివేయాలని హైకోర్టు వెల్లడించింది. ప్రసాదం తయారీలో వినియోగించే యాలకులు తినేందుకు అనువుగా లేవని, వాటిని ఎవరికీ పంపిణీ చేయకుండా చూడాలని శబరిమల ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌నుఆదేశించింది న్యాయస్థానం.


"అరవణ ప్రసాదాన్ని యాలకులు లేకుండా తయారు చేయండి. లేదా అందుకు బదులుగా వేరే ఇంకేదైనా సుగంధ ద్రవ్యాన్ని వాడొచ్చా లేదా అన్నది స్పైసెస్ బోర్డ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోండి" 


-కేరళ హైకోర్టు 


మరోసారి విచారణ..


రెండు వారాల తరవాత మరోసారి ఈ అంశంపై విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆరు లక్షల డబ్బాలను ధ్వంసం చేయాలని తేల్చి చెప్పింది. ఇప్పటి నుంచి యాలకులు లేని అరవణం ప్రసాదాన్ని పంపిణీ చేయాలని తెలిపింది. మకర సంక్రాంతికి అయ్యప్ప ఆలయానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. మకర జ్యోతి దర్శనం కోసం వస్తారు. ఇలాంటి కీలక తరుణంలో ప్రసాదాన్ని వినియోగించొద్దని కోర్టు ఆదేశించడం వల్ల కొరత ఏర్పడే అవకాశముంది. 


Also Read: Ramcharitmanas: ఆ మంత్రి నాలుక కోసిన వారికి రూ. పది కోట్ల నజరానా ఇస్తా - జగద్గురు పరమహంస ఆచార్య