Kerala Governor - CM Vijayan: 'రాజీనామాకు నేను రెడీ మరి మీరూ?'- ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్

ABP Desam   |  Murali Krishna   |  03 Nov 2022 03:57 PM (IST)

Kerala Governor - CM Vijayan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. సీఎం పినరయి విజయన్‌కు సవాల్ చేశారు.

'రాజీనామాకు నేను రెడీ మరి మీరూ?'- ముఖ్యమంత్రికి గవర్నర్ సవాల్

Kerala Governor - CM Vijayan: కేరళలో ముఖ్యమంత్రి- గవర్నర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు (Chief Minister Vijayan) గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) సవాల్ విసిరారు. యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని సీఎం విజయన్ రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) వ్యక్తులను తీసుకురావడానికి నేను ఇలా చేస్తున్నానని వారు పదే పదే చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనే కాదు, నా అధికారాన్ని ఉపయోగించి ఎవరినైనా నామినేట్ చేసి ఉంటే నేను రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే ఆయన (సీఎం విజయన్) రాజీనామాకు సిద్ధమా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి దీన్ని ఎలా సాధిస్తారు?                          -   ఆరిఫ్‌ మహ్మద్ ఖాన్‌, కేరళ గవర్నర్‌

కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్‌ కుంభకోణంపైనా గవర్నర్ విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్‌ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని గవర్నర్ అన్నారు.

ఇలా మొదలు

9 యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్ ఆదేశించారు. దీంతో గవర్నర్, కేరళ సర్కార్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను తొలగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విశ్వవిద్యాలయంలో ఇటీవల మంత్రి బాలగోపాల్ చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితంగా ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. దీంతో ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు.

బాలగోపాల్ వ్యాఖ్యలు నేను ఆయనతో చేయించిన ప్రమాణాన్ని ఉల్లంఘించాయి. ఉద్దేశపూర్వకంగా ప్రమాణాన్ని ఉల్లంఘించి, భారత ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు చేశారు.  విద్యాశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, మరికొందరు కూడా నాపై మాటల దాడులు చేశారు. అయితే నన్ను వ్యక్తిగతంగా బాధపెట్టినందుకు వారిని విస్మరిస్తున్నాను. కానీ ఆర్థిక మంత్రి బాలగోపాల్ చేసిన విద్రోహ వ్యాఖ్యలను పట్టించుకోకపోతే, నా బాధ్యతను విస్మరించినట్లవుతుంది.  "

-                                                         ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్
 
Published at: 03 Nov 2022 03:45 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.