అత్యధికులు ఎదుర్కొనే సమస్య కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్లకి సంబంధించిన అతిపెద్ద సమస్య ఇది. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించే ఆహారాన్ని తీసుకుని గుండెని కాపాడుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే శరీరంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యల్ని అధిగమించగలం. పోషకాలతో నిండిన, తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది బాహ్య, అంతర్గత శరీర పనితీరుని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకరకంగా ఆరోగ్యానికి మంచి చేస్తే మరొక విధంగా చెడు చేసి అనారోగ్యాల బారిన పడేలా చేస్తుంది.


మయో క్లినిక్ ప్రకారం కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే ఒక పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి శరీరానికి ఉపయోగపడుతుంది. అధిక స్థాయి కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. చివరికి అది గుండెపోటు లేదా స్ట్రోక్ కి కారణం అవుతుంది. శరీరంలోని చాలా కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. మిగతాది మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది.


చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దీన్ని లిపోప్రోటీన్ లేదా ఎల్దీఎల్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ధమనుల్లో పేరుకుపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, తాజా పండ్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడంతో పాటు కొన్ని సార్లు మందులు తీసుకోవడం వల్ల కూడా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు తినడం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించుకోవచ్చు.


చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పండ్లు ఎలా సహాయపడతాయి?


సీజనల్ వారీగా వచ్చే పండ్లు రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వివిధ మార్గాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్, పాలీఅన్‌ శాచురేటెడ్ కొవ్వులను తీసుకోవడం వల్ల ఎల్డీఎల్ స్థాయిలని తగ్గిస్తాయి. ఇవే కాకుండా కొన్ని ప్లాంట్ స్టెరాలస్, స్టానాల్స్ కొలెస్ట్రాల్ ని శరీరం గ్రహించకుండా నిరోధిస్తాయి.


చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పండ్లు


యాపిల్: పెక్టిన్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది. కరిగే ఫైబర్ గుణం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ని తగ్గించే ఉత్తమ పరిష్కారం. ఇందులోని పాలీఫెనాల్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.


బెర్రీలు: స్ట్రాబెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లూబెర్రీ వంటి సీజనల్ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణ హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. బెర్రీల్లోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల వల్ల గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.


నారింజ: నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. గుండెకి మేలు చేసి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.


అవకాడో: ఒలిక్ యాసిడ్ పవర్ హౌస్ అవకాడో. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని నిరోధించడంలో సహాయపడుతుంది. వీటినో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.


అరటి: అరటిపండలులో విటమిన్లు, ఖనిజాలతో పాటు సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలతో నిండి ఉంటుంది. అరటిపండ్లు పొటాషియం, ఫైబర్ మంచి మూలం. అవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగ లరు.


Also read: అతిగా వేరుశెనగ తింటున్నారా? తీవ్రమైన ఈ దుష్ప్రభావాలు తప్పవు