విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. దీన్ని ఖరారు చేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో రాజకీయా పార్టీలకు సంబంధం లేదని... అందుకే బీజేపీని ఇన్వాల్వ్ చేయడం లేదని అన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ కామెంట్స్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఫైర్ అయ్యారు.
కడప జిల్లా పులివెందుల్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు... వైఎస్‌ఆర్ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేయాల్సిన పనులను ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి చేయడమేంటని ప్రశ్నించారు. పులివెందులలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై, విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన విషయంలో ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు సోము వీర్రాజు. విశాఖ ప్రధాని పర్యటన విషయంలో విజయసాయి ప్రకటనలు తికమక పెడుతున్నాయన్నారు.
భారత ప్రధాని అధికారిక పర్యటన ఏపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఖరారు చేయాలని మిగతా విషాలు జిల్లా కలెక్టర్‌లు పర్యవేక్షించాలని అభిప్రాయపడ్డారు. కానీ ప్రధానమంత్రి పర్యటన విషయాలు విజయసాయిరెడ్డి ప్రకటన చేయడంపై సోమువీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి నిర్వహించిన సమీక్షను సోమువీర్రాజు తప్పుపట్టారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను కేంద్రం అందిస్తోంది వివరించారు సోమువీర్రాజు. రాష్ట్రంలో రైల్వే పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే విస్తరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇలా ఓ రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి పనులు గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని అభిప్రాయపడ్డారు సోమువీర్రాజు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని పని చేస్తూంటే రాష్ట్రంలో రాయలసీమ అభివృద్ధికి కుటుంబ పార్టీలు ఏం చేస్తున్నాయని సోమువీర్రాజు ప్రశ్నించారు. తాము మాత్రం రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గాలేరీ నగరి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించారు.
పవన్‌ను అనుమానిత వ్యక్తులు ఫాలో అవుతన్నారన్న విషయంపై కూడా సోమువీర్రాజు మండిపడ్డారు. పవన్‌కు హాని తలపడితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారాయన. పవన్ ఇంటివద్దకు వచ్చిన అపరిచిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయంలో యాంత్రీకరణకు కేంద్రం సహకరిస్తోందన్నారు సోమువీర్రాజు. యూరియా సబ్సిడీ ఇస్తోందని... ఇలాంటి చాలా సహకారాలను కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకోవాలన్నారు. సోలార్ మొటార్‌కి సబ్సిడీ కేంద్రం ఇస్తోంది వెల్లడించారు. ఇళ్ళకి కేంద్రం సబ్సిడీ ఇస్తూంటే రాష్ట్రం ఎందుకు నిర్మాణం చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఎందుకు సబ్సిడీ ఇవ్వడంలేదని నిలదీశారు.
మూడు రాజధానులు కడతామని ఎన్నికల ముందు జగన్ చెప్పలేదని గుర్తు చేశారు సోమువీర్రాజు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర న్యాయమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పులివెందుల నుంచి కూడా అమరావతికి, అనంతపురం మీదుగా బెంగుళూరుకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
పారిశ్రామిక వాడలను నిర్మాణం చేయాలన్న సంకల్పంతో ఏపీకి మూడు కారిడార్లు ప్రకటించారని సోమువీర్రాజు తెలిపారు. దీని వల్ల పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. కడపలో 8వేల ఎకరాలు కారిడార్ లో భాగంగా భూములు సేకరించడం జరుగుతోందన్నారు.