Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషిల్ కస్టడీ విధించారు. CBI కేసుపై విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ కోర్టు జులై 12వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అంగీకరించింది. లిక్కర్ స్కామ్‌ కేసులో మనీ లాండరింగ్‌కి సంబంధించి సీబీఐ విచారణ చేపడుతోంది. ఈ మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు ఆమోదం తెలిపింది. అంతకు ముందు స్పెషల్ జడ్జ్ సునేన శర్మ సీబీఐ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్‌లో ఉంచారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన క్రమంలో మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని అందుకు అంగీకరించింది. 






కేజ్రీవాల్ తమ విచారణకు సరైన విధంగా సహకరించడం లేదని ఆరోపించింది సీబీఐ. ఇదే విషయాన్ని పిటిషన్‌లో పేర్కొంది. ఏ ప్రశ్న అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. విజయ్‌ నాయర్‌తో పాటు మరి కొంత మంది ప్రతినిధులతో కేజ్రీవాల్‌ భేటీ అయ్యారని, కానీ ఆ వివరాలేమీ చెప్పడం లేదని సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ జ్యుడీషియల్ రిమాండ్ కారణంగా మళ్లీ కేజ్రీవాల్‌ని తిహార్ జైలుకి తరలించనున్నారు. చాలా నెలలుగా ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇటీవలే బెయిల్ వచ్చినప్పటికీ హైకోర్టు ఆ బెయిల్‌పై స్టే విధించింది. ఫలితంగా ఆయన జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. అటు ఈడీతో పాటు సీబీఐ కూడా విచారణ చేపడుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. 


"సాక్ష్యాధారాల గురించి ప్రశ్నిస్తుంటే ఏ మాత్రం ఆయన సరైన సమాధానం ఇవ్వడం లేదు. హోల్‌సేలర్స్ ద్వారా ఎంత లాభాలు పొందారన్నదీ చెప్పడం లేదు. కొవిడ్ సెకండ్ వేవ్‌ ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అంత హడావుడిగా లిక్కర్ పాలసీని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించాం. సౌత్‌ గ్రూప్ ప్రతినిధులు ఢిల్లీలో క్యాంప్ పెట్టడంతో పాటు కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్‌ నాయర్‌తో మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు"


- సీబీఐ






Also Read: West Bengal: మమతా బెనర్జీపై పరువు నష్టం దావా కేసు వేసిన గవర్నర్, ముదురుతున్న పంచాయితీ