Anna Ben Movies: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’లో ఎంతోమంది నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్న యాక్టర్లను రంగంలోకి దించాడు ఈ యంగ్ డైరెక్టర్. అందులో ఆన్నా బెన్ కూడా ఒకరు. మలయాళంలో హీరోయిన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆన్నా బెన్.. ‘కల్కి 2898 AD’లో కైరాగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తను నటించిన వాటిలో ఈ 6 సినిమాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు.
కుంబలంగి నైట్స్
హీరోయిన్‌గా ఆన్నా బెన్ మొదటి సినిమా ‘కుంబలంగి నైట్స్’. మధు సీ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చాలామంది యాక్టర్లు ఉన్నా కూడా ఆన్నా పర్ఫార్మెన్స్‌ను మాత్రం ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తించేలా చేసింది. ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా.. హీరోను గైడ్ చేసే పాత్రలో తను నటించింది. దీంతో వెంటనే తనకు హీరోయిన్‌గా అవకాశాలు రావడం మొదలయ్యింది. ‘కుంబలంగి నైట్స్’.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
హెలెన్
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమాల్లో ‘హెలెన్’ ఒకటి. సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో హెలెన్ పాల్ అనే పాత్రలో కనిపించింది ఆన్నా బెన్. దాదాపుగా తన ఒక్క పాత్ర చుట్టూనే సినిమా మొత్తం తిరిగినా.. ఆడియన్స్‌కు మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా తన నటనతో ఎంగేజ్ చేసింది. ఇదే మూవీని ‘మిలీ’ అనే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేసింది జాన్వీ కపూర్. ‘హెలెన్’ను చూడాలనుకుంటే యూట్యూబ్‌లో రెంట్‌కు అందుబాటులో ఉంది.
కప్పేలా
మహమ్మద్ ముస్తఫా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కప్పేలా’.. అప్పట్లో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో జెస్సీ వర్గీస్ పాత్రలో కనిపించింది అన్నా. అమాయకమైన అమ్మాయి.. ప్రేమ పేరుతో మోసం చేసేవాడి వలలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది అన్నదే ‘కప్పేలా’ కథ. ఇదొక సోషల్ డ్రామా మూవీ అయినా కూడా చివరివరకు ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా నడిపించాడు దర్శకుడు. దీనినే ‘బుట్టబొమ్మ’ అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. ప్రస్తుతం ‘కప్పేలా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
సారాస్
‘సారాస్’ మూవీ ఆన్నా బెన్ పాత్ర.. ఈ జెనరేషన్‌లోని చాలామంది అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించడంలో మాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది అని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి సినిమానే ‘సారాస్’. కానీ ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. జీవితాంతం పిల్లలు వద్దనుకునే సారా జీవితం ఎలా మారుతుంది అనేదే ఈ మూవీ కథ. మరోసారి తన నటనతో ‘సారాస్’ను ముందుకు తీసుకెళ్లింది ఆన్నా బెన్. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
నారదన్
‘నారదన్’ మూవీతో టోవినో థామస్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఆన్నా బెన్. మూవీలో టోవినో థామస్ పాత్ర కీలకంగా కనిపించినా.. అందులో ఆన్నా బెన్ కూడా తన నటనతో తన క్యారెక్టర్‌ను ప్రేక్షకుల్లో రెజిస్టర్ అయ్యేలా చేసింది. ప్రతీ సినిమాలో డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్లే ఆన్నా.. ‘నారదన్’లో షకీరాగా కనిపించి మెప్పించింది. టీఆర్‌పీ కోసం కొన్ని మీడియా సంస్థలు చేసే స్కామ్ గురించి చెప్పడమే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
కొట్టుక్కాళి
ఇప్పటివరకు తను చేసిన ప్రతీ సినిమాతో తన యాక్టింగ్ కెపాసిటీ ఏంటో ప్రేక్షకులకు తెలిసేలా చేసింది ఆన్నా బెన్. ఇక వాటన్నింటిని దాటి ప్రేక్షకులకు మరింతగా ఆశ్చర్యపరిచిన మూవీ ‘కొట్టుక్కాళి’. ఇది తమిళంలో తన మొదటి సినిమా. ఇందులో తనకంటే తక్కువ సామాజిక వర్గానికి చెందిన మీనా అనే పాత్రలో ఆన్నా కనిపించింది. ఇప్పటికే ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఇంకా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Also Read: ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడ్డాను, బయటికి పారిపోయాను - షాలిని పాండే