CV Ananda Bose: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు తారస్థాయి చేరుకున్నాయి. ఈ మధ్య మమతా గవర్నర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌కి వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారని, ఆ స్థాయిలో వాళ్లను వేధిస్తున్నారని ఆరోపించారు. కొంత మంది బాధితులు తమతో ఈ గోడు చెప్పుకున్నారని మమతా అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆనంద బోస్‌ మండి పడ్డారు. మమతా బెనర్జీపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ప్రజా ప్రతినిధి అయ్యుండి ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అనవసరపు అలజడి సృష్టించొద్దని తేల్చి చెప్పారు. మమతా బెనర్జీతో పాటు మరి కొంత మంది తృణమూల్ నేతలపైనా పరువునష్టం దావా వేశారు ఆనంద బోస్.


మే 2వ తేదీన ఈ వివాదం మొదలైంది. రాజ్‌భవన్‌లోని ఓ మహిళా ఉద్యోగి గవర్నర్‌ ఆనంద బోస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. ఇదే విషయమై కొంత మంది తృణమూల్ నేతల్ని మీడియా పదేపదే ప్రశ్నించింది. కానీ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వకుండా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేమని ఆయా నేతలు తేల్చి చెప్పారు. అటు బీజేపీ నేతలు మాత్రం గవర్నర్‌కి అండగా ఉన్నారు. మమతా బెనర్జీపై పరువునష్టం దావా వేయడాన్ని సమర్థించారు. ఎప్పుడో ఈ పని చేయాల్సింది అని వెల్లడించారు. 


ఇటీవలే ఎన్నికైన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. రాజ్‌భవన్‌కి వెళ్లాలంటే తమకు భయంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా రాజకీయంగా దుమారం రేగింది. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన చేసింది. కేవలం తమ వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారని, అంతకు మించి ఏ కారణమూ లేదని వెల్లడించింది. ప్రజాప్రతినిధులు అయ్యుండి అలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మందలించింది. అలాంటి చెత్త వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం కూడా లేదని చాలా ఘాటుగా సమాధానమిచ్చింది.


అటు దీదీ మాత్రం గవర్నర్‌పై మండి పడుతూనే ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే...రాజ్‌భవన్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని ఎదురు చూసినట్టు స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకూ వాళ్ల నుంచి రాజ్‌భవన్‌కి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. గవర్నర్‌ ఢిల్లీలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి వచ్చిందని, అందుకే అప్పుడు ఆయన అందుబాటులో లేరని వివరించింది. మొత్తంగా ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికైతే గవర్నర్‌పై విచారణ కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమా కాదా పోలీసులే తేల్చనున్నారు. 


Also Read: అలా చేస్తే మగవాళ్లు ఇట్టే మందు మానేస్తారు, మహిళలకు మధ్యప్రదేశ్ మంత్రి సలహా