Kejriwal Arrest News: లోక్‌పాల్ ఉద్యమనేత అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. మద్యానికి దూరంగా ఉండాలని తాను ఎన్నో సార్లు చెప్పినట్టు గుర్తు చేశారు. డబ్బుకి ఆశపడి కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ పాలసీయే చేశారని అన్నారు. అటు ప్రతిపక్షాలు కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలబడుతుండగా..అన్నా హజారే మాత్రం ఆప్ అసలు ఆ పాలసీ రూపొందించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
"మద్య నిషేధంపై నాతో పాటు ఉద్యమం చేసి, నా వెన్నంటే ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడిలా లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరెస్ట్ అవడం చాలా బాధగా ఉంది. కానీ మనమేం చేయగలం. ఏం జరిగినా అది చట్ట ప్రకారమే జరిగింది"
- అన్నా హజారే, సామాజిక కార్యకర్త
2011లో అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే (Anna Hazare) భారీ ఉద్యమం చేశారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో పాటే ఉద్యమించారు. అప్పుడే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేని అన్నా హజారే కేజ్రీవాల్‌కి బయట నుంచి మద్దతునిచ్చారు. కానీ...కొన్ని అంశాల్లో పార్టీని విమర్శించడంలో మాత్రం వెనకాడలేదు. అటు కేజ్రీవాల్ ఈ విమర్శల్ని పట్టించుకోలేదు. లిక్కర్ పాలసీపై గతంలోనే అన్నాహజారే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తన ఆవేదనంతా వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ‘‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను రాస్తున్న మొట్ట మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ గురించి తెలిసి చాలా బాధగా అనిపించింది. మద్యంలాగే అధికారమూ మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్టుగా అనిపిస్తోంది’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.
ఏంటీ స్కామ్..?
2021-22లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించింది. మద్యం షాప్‌లని 100% ప్రైవేటీకరణ చేసింది. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెప్పింది. హోల్‌సేలర్స్‌కి 12% లాభాలు వచ్చేలా, రిటైలర్స్‌కి ఏకంగా 185% లాభాలు వచ్చేలా పాలసీ తయారు చేసింది. అయితే..హోల్‌సేలర్స్‌కి ఇచ్చిన 12% లాభాల మార్జిన్‌లో దాదాపు 6% తమకు ఇచ్చేలా ఆప్ ప్లాన్ చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సౌత్ గ్రూప్ విజయ్ నాయర్‌కి రూ.100 కోట్లు ముట్టజెప్పినట్టు ఈడీ చెబుతోంది. అసలు మొత్తంగా ఇది రూ.100 కోట్ల కుంభకోణం కాదని రూ.600 కోట్ల వరకూ స్కామ్ జరిగిందని కోర్టుకి వివరించింది.
Also Read: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీకి భారీ విరాళాలు, టాప్ డోనార్స్ లిస్ట్ ఇదే