Telangana News: ఇంట్లో దొంగలు పడితే.. కత్తులు, తుపాకులు చూపించి బెదిరిస్తే..? ఎవరైనా ఏం చేస్తారు..? బెదిరిపోతారు, భయపడిపోతారు... ప్రాణభయంతో వణికిపోతారు. ఇంట్లో ఉన్నవన్నీ దోచుకెళ్తున్నా చూస్తూ ఉండిపోతారు. కానీ బేగంపేటలోని తల్లీకూతుళ్లు మాత్రం ధైర్యం ప్రదర్శించారు. దొంగలపై తిరగబడ్డారు. కత్తులకు బెదరలేదు... తుపాకీకి జడవలేదు. ఎదురుతిరిగారు... దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తల్లీకూతుళ్ల సాహనం చూస్తే... ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. కాస్తైనా భయమన్నదే లేకుండా... ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలను తరిమితరిమి కొట్టారు ఆ తల్లీకూతుళ్లు.
అసలు ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ బేగంపేటలోని రసూల్‌పురా హౌసింగ్ కాలనీలో.. ఆర్కే జైన్ అనే వ్యాపారవేత్త ఉంటున్నారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో వీరికి రబ్బరు ఫ్యాక్టరీ ఉంది. నిన్న (గురువారం) మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో వారి ఇంట్లో ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో జైన్ భార్య అమిత మెహోత్, ఆమె కూతురు, పనిమనిషి మాత్రమే ఉన్నారు. పనిమనిషి వంటగదిలో ఉండగా... ఆర్కే జైన్ భార్య, కూతురు మరో గదిలో ఉన్నారు. ఆ సమయంలో కొరియర్ అంటూ ఇద్దరు దుండగులు ఇంట్లో చొరబడ్డారు. వంటగదిలో ఉన్న పనిమనిషికి తుపాకీ గురిపెట్టారు. పనిమనిషి పెద్దగా అరవడంతో... మరో గదిలో ఉన్న అర్కే జైన్ భార్య, కూతురు బయటకు వచ్చారు. మరో ఆగంతకుడు కత్తి చూపిస్తూ.. వారిని బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామంటూ బెదిరించారు. కత్తి పట్టుకుని బెదిరించిన వ్యక్తి... గతంలో తమ ఇంట్లో పనిచేసిన ప్రేమ్‌చంద్ అని గుర్తుపట్టిన జైన్ భార్య.. అతన్ని నిలదీసింది. ఎందుకొచ్చావ్ అంటూ పెద్దగా అరిచి... అతడిపై తిరగబడింది. వారి అరుపులకు వంటగదిలో గన్ పట్టుకుని ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. అతను తళ్లీకూతుళ్లకు గన్ గురిపెట్టి.. కాల్చేస్తానంటూ బెదిరించాడు. అయినా... ఆ తల్లీకూతుళ్లు భయపడలేదు. గన్ పట్టుకున్న వ్యక్తిపై తిరగబడ్డారు. అతని చేతిలోని తుపాకీ లాగేసుకున్నారు. దీంతో.. అతను అతను పరారయ్యాడు. ఇంతలో... తళ్లీకూతుళ్ల అరుపులకు చుట్టుపక్క వారంతా గుమిగూడారు. దీంతో కత్తి పట్టుకున్న మరో వ్యక్తి కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కత్తి చూపిస్తూ... ఇంట్లో నుంచి బయటకు రాబోయాడు. కానీ... తల్లీకూతుళ్లు అతని వెంటపడ్డారు. స్థానికుల సాయంతో అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కత్తి పట్టుకుని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ప్రేమ్‌చంద్ అని... గతంలో ఆర్కే జైన్ ఇంట్లోనే పనిచేశాడని పోలీసులు గుర్తించారు. తుపాకీతో బెదిరించి పారిపోయిన వ్యక్తి కోసం గాలించారు. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బేగంపేట పోలీసులు.
తల్లీకూతుళ్ల సాహసం
తల్లీకూతుళ్లు కత్తులు, తుపాకులతో ఇచ్చిన ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపరుస్తోంది. మారణాయుధాలకు కూడా భయపడకుండా... ఎంతో సాహసం ప్రదర్శించారు. ఏ మాత్రం భయపడకుండా దొంగలపై తిరగబడ్డారు. జైన్ ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజీలో తళ్లీకూతుళ్ల వీరోచిత పోరాటం రికార్డ్ అయ్యింది. ఆ వీడియో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. తల్లికూతుళ్ల ధైర్యసాహసాలు చూసినా వారంతా.... వాహ్వా అంటున్నారు. తల్లికూతుళ్ల సాహనానికి సలాం కొడుతున్నారు. వారి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొనియాడుతున్నారు.