తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన వెళ్తున్నది ప్రతిపక్షాల భేటికో లేకపోతే కేంద్ర పెద్దలతో సమావేశానికో కాదు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ కోసం వెళ్తున్నారు. రహస్య సమావేశాలు ఏమైనా ఉంటాయే లేదో చెప్పలేం కానీ ఆయన పర్యటన అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ సొంత వ్యవహారమే. అయితే భవిష్యత్ కేసీఆర్ ఢిల్లీ రాజకీయానికి ఈ పర్యటన మొదటి అడుగు అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. హస్తినలో కట్టబోతున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌కు ప్రత్యేకమైన ఆసక్తి..! 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై చాలా కాలంగా ఆసక్తి ఉంది. స్వయంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఆయన రంగంలోకి దిగాలని చాలా సార్లు అనుకున్నారు. అవసరం అయితే జాతీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. అజెండాతో ఆయన చాలా కాలం కార్యచరణ నిర్వహించారు కూడా. ఫెడరల్ ఫ్రంట్  కోసం అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేశారు. కానీ కలసి రాలేదు.  దాంతో  ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ఇక ముందు జాతీయ రాజకీయాల వైపు చూడరని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇది సరైన సమయం మాత్రం కాదని వెనక్కి తగ్గారు.


బీజేపీపై యుద్ధం ప్రకటించి అనూహ్యంగా వెనక్కి తగ్గిన గులాబీ దళాధిపతి..!


గ్రేటర్ ఎన్నికల ముందు వరకూ బీజేపీతో  తాడో పేడో తేల్చుకుంటామన్న వ్యూహంలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో  ప్రాంతీయ పార్టీల కూటమి సమావేశం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీతో పాటు పలువురు నేతలతో మాట్లాడామని ప్రకటించారు. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా వెనక్కి తగ్గిపోయారు. బీజేపీతో రణం లేదని ప్రకటించేశారు. అదే సమయంలోరాజీ కూడాలేదని తాను లొంగిపోలేదన్న సంకేతాన్ని పంపారు. అప్పట్నుంచి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. మమతా బెనర్జీ ఆహ్వానం పంపినా పట్టించుకోలేదు. బీజేపీ వ్యతిరేక పక్షాల కూటమి సమావేశాలకూ హాజరు కావడం లేదు. అంత మాత్రాన ఆయన బీజేపీతో ఉన్నారని కానీ...  ఎన్డీఏలో చేరుతారని కానీ ఎవరూ చెప్పలేకపోతున్నారు.


ముందడుగు కోసం సరైన సమయం కోసం వెయిటింగ్..!


సమయం చూసి రాజకీయం చేయడంలో కేసీఆర్‌ను మించిన వారులేరు.  పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అధికులం అంటే ఎదురయ్యే సమస్యలు ఆయనకు తెలుసు అందుకే ఆయన సైలెంట్‌గా ఉంటున్నారని అంటున్నారు. అలాగని జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి తగ్గలేదని చెప్పడానికి ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించడమే సాక్ష్యమని అంటున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో కార్యాలయాలు ఎక్కువగా ఉండవు. ఐదేళ్లకోసారి బలాబలాలు మారిపోతూంటాయి. అందుకే చాలా పార్టీలు ఢిల్లీ కార్యాలయం గురించి ఆలోచించలేదు. కానీ కేసీఆర్ మాత్రం చాలా రోజులుగా ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్‌ను నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆయన పట్టుదల ఇప్పటికి సాకారం అవుతోంది. రెండో తేదీన కార్యాలయానికి శంకు స్థాపన చేస్తున్నారు.


బీజేపీపై వ్యతిరేకత పెరిగేకొద్దీ వాయిస్ పెంచుతారా..?


వచ్చే ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగాజాతీయ రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నారనిటీఆర్ఎస్ వర్గాలు ఎప్పటి నుండో అంచనా వేస్తున్నాయి.  బీజేపీని ఢీకొట్టే విషయంలో ముందూ వెనుకా ఆలోచిస్తున్నకేసీఆర్ ఎన్నికల వేడి పెరిగే కొద్దీ బీజేపీపై ఎటాక్ పెంచుతారని భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కూటమి సమావేశాలకు టీఆర్ఎస్ హాజరు కావడం లేదు. బీజేపీకి వ్యతేరికంగా జరిగే సమావేశాలకు వీలైనంత దూరం పాటిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం ఆయా పార్టీలతో పరోక్షంగా టచ్‌లో ఉన్నట్లుగా చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడు తాము బీజేపీపై పోరాటానికి సిద్ధమని సంకేతాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఒక వేళ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదనుకుంటే ఆయన నేరుగా ఎన్డీఏలోనూ చేరినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ఇంతకు ముందు నుంచే ఉంది  ఈ క్రమంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌కు స్పష్టమైన రూట్ మ్యాప్ ఉందన్న అభిప్రాయం అంతకంతకూ బలపడుతోంది. ఢిల్లీలో కార్యాయాన్ని శరవేగంగా నిర్మించిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యూహంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.