Tourism Boost in Kashmir: కశ్మీర్‌లో పర్యాటక రంగం (Kashmir Tourism) సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది 12.5 లక్షల మంది పర్యాటకులు కశ్మీర్‌ని సందర్శించారు. స్థానిక టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఈ విషయం వెల్లడించింది. శ్రీనగర్‌లోని లోకల్ హోటల్స్‌కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. గుల్‌మార్గ్‌తో పాటు సోనామార్గ్, పహల్గామ్ లాంటి హిల్ స్టేషన్‌లకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జూన్ నెల సగం రోజులు ఇక్కడి హోటల్స్‌కి ఫుల్‌ డిమాండ్ కొనసాగింది. హోటల్స్‌తో పాటు గెస్ట్‌హౌజ్‌లు, హోమ్‌స్టేలు, హౌజ్‌బోట్స్‌కీ డిమాండ్‌ పెరిగింది. లాడ్జింగ్ సౌకర్యాలు మునుపటి కన్నా మెరుగవడం వల్ల పర్యాటక రంగానికి జోష్ వచ్చింది. దీనికి తోడు శాంతి భద్రతలూ గతంతో పోల్చితే మెరుగయ్యాయి. టూరిస్ట్‌లు ఈ స్థాయిలో రావడానికి ఇది కూడా ఓ కారణం అని అధికారులు వెల్లడించారు. విదేశీ పర్యాటకులూ కశ్మీర్‌కి వస్తున్నారు. 


"కశ్మీర్‌కి విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది. వాళ్ల ద్వారా ఆదాయమూ పెరిగింది. స్థానిక పర్యాటకులతో పోల్చితే వీళ్లు పెట్టే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. హోటల్‌ తీసుకోవడం నుంచి ఆ తరవాత చేసే ప్రతి ఖర్చులోనూ ఆ తేడా కనిపిస్తోంది. లగ్జరీగా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫైవ్ స్టార్‌ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి"


- అధికారులు


సాధారణంగా అమర్‌నాథ్ యాత్ర మొదలైన తరవాత కశ్మీర్‌కి పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ రద్దీలో కశ్మీర్‌కి వెళ్లడం ఎందుకని చాలా మంది వాయిదా వేసుకుంటారు. కానీ...ఈ సారి ఈ యాత్రతో సంబంధం లేకుండా చాలా మంది పర్యాటకులు కశ్మీర్‌కి వచ్చారు. ఈసారి అమర్‌నాథ్ యాత్ర ప్రభావం కశ్మీర్ టూరిజంపై పడలేదని అధికారులు వెల్లడించారు. షిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్‌ లాంటి హిల్‌స్టేషన్స్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లేందుకు అక్కడ అనువైన సౌకర్యాలు లేవని వివరించారు. అందుకే కశ్మీర్‌కి ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని తెలిపారు. గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మొత్తంలో పర్యాటకులు వస్తున్నారు. వచ్చే నెల నుంచి ఢిల్లీ, పంజాబ్ నుంచి కూడా టూరిస్ట్‌లు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 


కశ్మీర్‌లో ప్రస్తుతం హార్టికల్చర్ తరవాత ఆ స్థాయిలో ఆదాయం వచ్చేది టూరిజం నుంచే. లోకల్ టూరిజం వల్ల ఏటా కనీసం రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తోంది. హోటల్స్‌, హౌజ్‌బోట్‌లు, షికారావాలాలు, ట్యాక్సీ ఆపరేటర్‌లు, టూరిస్ట్ గైడ్‌లకు మంచి ఆదాయం లభిస్తోంది. వీళ్లతో పాటు హస్త కళాకారులకూ సరిపడ ఆదాయం వస్తోంది. శాలువాలు, కార్పెట్‌లు భారీగా అమ్ముడుపోతున్నాయి. మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడడం లేదు. కశ్మీర్‌ని పర్యాటక రంగంలో నంబర్ 1 స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్‌లో కొత్త కొత్త టూరిస్ట్ ప్లేస్‌లనూ కనుగొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు అధికారులు. 


Also Read: Arvind Kejriwal: నేను చనిపోతే దయచేసి ఎవరూ బాధ పడొద్దు, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు