Palnadu Police Suggestion To People: మే 13న పోలింగ్ సందర్భంగా అనంతరం పల్నాడు (Palnadu) జిల్లాతో సహా అనంతపురం, తిరుపతి జిల్లాలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్లో టీడీపీ, వైసీపీ వర్గాల వారికి అధిక సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ నిరంతరం పహారా కాస్తున్నారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
'పల్నాడు పేరు చెడగొట్టొద్దు'
దేశంలోనే పల్నాడు ప్రాంతానికి మంచిపేరు ఉందని.. దాన్ని చెడగొద్దంటూ ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఎన్నికల క్రమంలో జరిగిన గొడవలతో ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు పేరొందిందని అన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, షాపులు, వాహనాలు తగలబెట్టడం వంటివి చేస్తే ఉపేక్షించమని అన్నారు. మాచర్ల, నరసరావుపేటలో జరిగిన గొడవలు దేశమంతటా మార్మోగాయని పేర్కొన్నారు. పోలీసులంటే ఎవరికీ భయం లేదని.. మరోసారి జిల్లాలో అల్లర్లు జరిగితే పోలీసులంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. జిల్లా మొత్తం అరాచకంగా ఉందని.. మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందని అన్నారు.
గురజాల ప్రజలకు అలర్ట్
ఈ క్రమంలో గురజాల పట్టణ, రూరల్ ప్రాంత ప్రజలకు పోలీసులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. జూన్ 1న (శనివారం) సాయంత్రం నుంచి ఇక్కడ 144 సెక్షన్ పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుందని.. ఏ ఒక్క షాపు కూడా ఓపెన్ చెయ్యరని తెలిపారు. జూన్ 5 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. కావున ప్రజలు ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన సరుకులు, ఇతర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే, స్థానికంగా షాపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని.. అలా ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి పోలీస్ వారికి సహకరించాలని సూచించారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
షాపులు బంద్
కౌంటింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్నామని.. పల్నాడులో జూన్ 2 నుంచి 5వ తేదీ వరకూ వరుసగా 4 రోజులు షాపులు బంద్ చేయాలని వ్యాపార వర్గాలకు ఎస్పీ సూచించారు. పల్నాడులో గడిచిన 18 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోందని అన్నారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడిన, ప్రోత్సహించిన నాయకులు ఎవరినైనా వదిలేదని లేదని వార్నింగ్ ఇచ్చారు. 10 రోజుల వ్యవధిలోనే 160 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఘర్షణల కేసుల్లో 1300 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను పెట్టేందుకు జైళ్లు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లు చెప్పారు. గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలేనని.. కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడొద్దని సూచించారు.
Also Read: Andhra Pradesh News: సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో చర్యలు