Arvind Kejriwal Message For Supporters: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ గడువు ముగిసిపోతున్న క్రమంలో కీలక ప్రకటన చేశారు. ఆదివారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి ఈడీ ఎదుట లొంగిపోతానని వెల్లడించారు. జూన్ 1వ తేదీతో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోతుంది. జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట లొంగిపోవాలని కోర్టు కండీషన్ పెట్టింది. ఈ మేరకు తాను సరెండర్ అవుతానని కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే...ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం చాలా వరకూ క్షీణించిందని, బరువు తగ్గిపోయానని వెల్లడించారు. డయాబెటిస్‌కి మెడికేషన్‌ తీసుకోడానికి కూడా తనకు అనుమతి ఇవ్వలేదని మండి పడ్డారు. 


"జైల్‌లో దాదాపు 50 రోజుల పాటు ఉన్నాను. ఆ 50 రోజుల్లోనే నేను 6 కిలోల బరువు తగ్గాను. విడుదలైన తరవాత కూడా నేను బరువు పెరగలేదు. వైద్యులు నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోను. ఉచిత విద్యుత్, వైద్యం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాంటి హామీలు నెరవేర్చకుండా ఉండను. మీతో నేను లేకపోయినా సరే అన్ని పనులూ జరుగుతాయి"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించీ ప్రజలు ప్రార్థించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ తనను అణిచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. నోరు మూయించేందుకూ కుట్ర చేశారని, కానీ వాళ్ల వల్ల కాలేదని అన్నారు. బీజేపీకి ఏం కావాలో అర్థం కావడం లేదని, ఇదంతా ఎందుకు చేస్తున్నారోనని ప్రశ్నించారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు.  ఈ ఏడాది మార్చి 21 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ తేల్చి చెప్పింది. ఛార్జ్‌షీట్‌లోనూ ఇదే స్పష్టం చేసింది. దీనిపై కేజ్రీవాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఆప్‌ని టార్గెట్ చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలంతా గమనించాలని కోరారు. 


Also Read: నీటి వాటా కోసం ఢిల్లీ న్యాయపోరాటం, సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఆప్ సర్కార్