AP CS Posting To AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswararao) ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా, శుక్రవారమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఇటీవలే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (CAT) ఎత్తేసింది. గురువారం హైకోర్టు సైతం ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని.. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయన్ను ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా నియమించింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆయన సాయంత్రం ఉద్యోగ విరమణ చేయనున్నారు.


'బాధ్యతలు స్వీకరించిన రోజే..'


అటు, బాధ్యతలు స్వీకరించిన రోజే ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 'ఈ రోజు నాకు పదవీ విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. కారణాలు ఏమైనా ఆల్ ఇజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా. ప్రస్తుతం వివాదాస్పద అంశాలు మాట్లాడలేను. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నా' అని పేర్కొన్నారు.


ఐదేళ్లుగా..


టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ హయాంలో పోస్టింగ్ దక్కలేదు. మొదట 6 నెలలు ఆయన ఖాళీగానే ఉన్నారు. తర్వాత రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఆయనపై ప్రభుత్వం మే 31, 2019న సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. 


అయినా, పోస్టింగ్ దక్కకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను (CAT) ఆశ్రయించారు. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సైతం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. 


సీఎస్ ను కలిసిన ఏబీవీ


అయితే, హైకోర్టులోనూ అనుకూలంగా తీర్పు రావడంతో ఏబీవీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఉన్న త న్యాయస్థానం ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారమే ఆయన పదవీ విరమణ చేస్తుండడంతో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా.. రిటైర్మెంట్ రోజునే విధుల్లో చేరి ఆ వెంటనే పదవీ విరమణ చేయనున్నారు.


Also Read: Andhra Pradesh News: సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో చర్యలు