Southwestern Monsoon Enter In Telugu States: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. ఉక్కపోత, భానుడి భగభగలతో విలవిల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే చల్లటి కబురు అందించింది. కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు(Southwestern Monsoon) ముందుకు సాగుతున్నాయి. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని రెండు మూడు రోజుల్లో అంటే జూన్ 2 లేదా 3 తేదీల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


జూన్ 2 లేదా 3 రాయలసీమలోకి..
గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్‌ 2, 3 తేదీలనాటికి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరో రెండు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, యానాం సమీపంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. రుతు పవనాల కారణంగా కోస్తా, రాయలసీమలో శుక్రవారం, శనివారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.


జూన్ ఐదు తరువాత తెలంగాణలోకి ఎంట్రీ
నైరుతి రుతుపవనాలు రాయలసీమను దాటుకుని క్రమంగా ముందుకు సాగుతూ జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగొచ్చని, శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. చాలాచోట్ల సాధార­ణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావ­రణ శాఖ తెలిపింది.  ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపా­డులో 47.1 డిగ్రీలు, కమాన్‌పూర్‌లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్‌నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత నమోదైంది. 


కేరళ వ్యాప్తంగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళ, ఈశాన్య రాష్ట్రాలను తాకాయి. రేమాల్ తుఫాను ప్రభావంతో రుతు పవనాలు వేగంగా కేరళను తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. వారం ముందుగానే రుతుపవనాల పురోగమనంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితొ పోలిస్తే ఈసారి ముందుగానే నైరుతి పవనాలు కేరళను తాకాయి. 1951 నుంచి 2023 వరకూ ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని.. ఈ ఏడాది కూడా రుతుపవనాలు కదలిక అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.